ఒక్కరోజులో 23 పైసలు పెరుగుదల
ముంబై, జనవరి 22: రూపాయి చరిత్రలో రికార్డు కనిష్ఠస్థాయి నుంచి కోలుకున్నది. డాలర్ బలహీన పడటం, ఇతర వర్థమాన కరెన్సీలు పెరగడంతో బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కె ట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే మరో23 పైసలు లాభపడి 86.35 వద్ద ముగిసింది.
ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి 86.75 స్థాయి నుంచి వరుస మూడు రోజుల్లో 40 పైసలు కోలుకున్నది. డాలర్ రెండేండ్ల గరిష్ఠస్థాయి నుంచి తగ్గడం, క్రూడ్ ధరలు క్షీణించడం దేశీ కరెన్సీపై సానుకూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.
దేశీయ డాలర్ ఇండెక్స్ 108 వద్ద కదులుతున్నది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 80.40 డాలర్ల స్థాయికి దిగింది. సమీప భవిష్యత్తులో రూపాయి 86.20 65 రేంజ్‌లో ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేశారు.