85.27 స్థాయికి కరెన్సీ విలువ
ముంబై, డిసెంబర్ 26: డాలర్ బలోపేతంకావడం, దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలిస్తున్న నేపథ్యంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్ఠస్థాయికి పతనమయ్యింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ మరో 12 పైసలు నష్టపోయి 85.27 వద్ద నిలిచింది.
ఈ నెలలో ఇప్పటివరకూ రూపాయి 60 పైసలు పైగా నష్టపోయింది. ఈ వారంలో మూడు రోజుల్లోనే 24 పైసల నష్టాన్ని కరెన్సీ చవిచూసింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరగడం, నెలాఖరు చెల్లింపుల కారణంగా డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయిని దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల ఉత్పత్తులపై టారీఫ్‌లు పెంచుతారన్న భయాలతో దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతున్నదని వారు చెప్పారు. డాలర్ ఇండెక్స్ రెండేండ్ల గరిష్ఠస్థాయి 108 సమీపంలో ట్రేడవుతున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 74 డాలర్ల వద్దకు పెరిగింది. రానున్న రోజుల్లో డాలరు/రూపాయి పెయిర్ 85.10-85.45 రేంజ్‌లో ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేశారు.