calender_icon.png 17 January, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి మరింత పతనం

09-01-2025 12:00:00 AM

నూతన కనిష్ఠస్థాయి 85.87 వద్ద ముగింపు

ముంబై, జనవరి 8: రూపాయి క్షీణబాటలోనే పయనిస్తున్నది. డాలర్ బలోపేతంకావ డం, ఇతర వర్థమాన కరెన్సీలు క్షీణించడంతో రూపాయి మరో నూతన కనిష్ఠస్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారి న్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ ఇంట్రాడేలో 85.89 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయిని తాకింది.

చివరకు 13 పైసలు నష్టపోయి 85.87 వద్ద ముగిసింది. జనవరి 3న రూపాయి 85.79 వద్దకు తగ్గిన తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, తిరిగి ఆ స్థాయిని సైతం కోల్పోయింది. 85.87 స్థాయి వద్ద ముగియడం ఇదే ప్రధమం. డాలర్ రెండేండ్ల గరిష్ఠస్థాయి వద్దకు చేరడం, క్రూడ్ ధరలు పెరగడం దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.

దేశీయ ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం కూడా రూపాయిని క్షీణబాటలో నడిపిస్తున్నదన్నారు. డాలర్ ఇండెక్స్ 108.75 వద్ద కదులుతున్నది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై ఆచితూచి వ్యవహరిస్తుందన్న అంచనాలతో యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ కూడా 4.67 గరిష్ఠస్థాయికి చేరింది.

ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 77.74 డాలర్ల వద్దకు పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ వారం తొలి మూడు రోజుల్లోనే రూ. 7,300 కోట్లకుపైగా పెట్టుబడుల్ని ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.