* 85.20 రికార్డు కనిష్ఠస్థాయికి కరెన్సీ విలువ
ముంబై, డిసెంబర్ 24: డాలర్ బలోపేతంకావడం, దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలిస్తున్న రూపా యి విలువ మరో కొత్త కనిష్ఠస్థాయికి పతనమయ్యింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ మరో 9 పైసలు నష్టపోయి 85.20 వద్ద నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకూ రూపాయి 55 పైసల మేర నష్టపోయింది. నెలాఖరు చెల్లింపుల కారణంగా డాలర్లకు డిమాండ్ పెరగ డమూ రూపాయిని దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల ఉత్పత్తులపై టారీఫ్‌లు పెంచుతారన్న భయాలతో డాలరు బలపడుతున్నదని వారు వివరించారు. డాలర్ ఇండెక్స్ రెండేండ్ల గరిష్ఠ స్థాయి 108 సమీపంలో ట్రేడవుతున్నది. దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు పుంజుకోవడానికి తోడు దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనతతో రూపాయి ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి తగ్గిందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. రానున్న రోజుల్లో డాలరు/రూపాయి పెయిర్ 85 రేంజ్‌లో ట్రేడవుతుందని అంచనా వేశారు.