ఆల్టైమ్ కనిష్ఠానికి భారత కరెన్సీ
న్యూఢిల్లీ: భారత కరెన్సీ సరికొత్త ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలరుతో రూపాయిమారకం విలువ 0.4 పైసలు క్షీణించి రూ.86.50 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతోపాటు అమెరికాలో ఉద్యోగ కల్పన పెరగడంతో రూపాయి విలువ మరింత పడిపోయింది. అదేవిధంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో డాలర్ బలప డుతున్నది.
గత నెలలో కొత్తగా 2.56 లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని యూఎస్ నాన్‌ఫార్మ్ పేరోల్స్ డాటా వెల్లడించింది. సర్వీస్ సెక్టార్, తయారీ రంగంలో 1.60 లక్షల ఉద్యోగాలను మాత్రమే కొత్తగా సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ.. దానికి అదనంగా ఉద్యోగాలు కల్పించడం కూడా డాలర్ బలపడటానికి కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
దీనికితోడు అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది మూలధన ప్రవాహానికి దారితీసింది. ఈ ఒక్క నెలలోనే విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి 4 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రూపాయిపై మరింత ఒత్తిడి పెరుగుతున్నది.
అదేవిధంగా ట్రంప్ మరో వారం రోజు ల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. అధికారంలోకి వచ్చీరాగానే వాణి జ్యానికి సంబంధించి కఠిన చర్య లు తీసుకుంటారనే అంచనాలు కూడా తోడవడంతో డాలర్ విలువ పెరుగుతూ వస్తున్నది. కాగా, గత మూడు నెలలుగా రూపాయి పతనం కొనసాగుతున్నది. రూపా యి క్షీణత మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, మార్చి నాటికి రూ.88కి పడిపోతుందని ఫారెన్ ఎక్స్‌చేంజ్ గ్లోబల్ హెడ్ బ్రాడ్ బెచెల్ అన్నారు. అయితే ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవచ్చని భావిస్తున్నారు.