calender_icon.png 11 October, 2024 | 6:55 PM

Breaking News

ఒక్కరోజే 437 పరుగులు 18 వికెట్లు

01-10-2024 12:00:00 AM

బంగ్లా 233 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 26/2

285/9 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ 

రసకందాయంలో రెండో టెస్టు

* భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టులో తొలి మూడు రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కానీ నాలుగో రోజు వచ్చేసరికి ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకే రోజులో 437 పరుగులు రావడంతో పాటు 18 వికెట్లు నేలకూలాయి. బజ్‌బాల్ ఆటను బంగ్లాకు రుచి చూపించిన టీమిండియా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. వెరసి పేలవ డ్రాగా ముగుస్తుందనుకున్న టెస్టు మ్యాచ్ కాస్తా రసకందాయంలో పడింది.

కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. పేలవ డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వర్షం అంతరాయంతో తొలి మూడు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినప్పటికీ నాలుగో రోజు మాత్రం పూర్తి ఆట సాధ్యమైంది.

నాలుగో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. షాదమన్ ఇస్లామ్ (7*), మొమినుల్ హక్ క్రీజులో ఉన్నారు. అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జైస్వాల్ (51 బంతుల్లో 72), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68), కోహ్లీ (35 బంతుల్లో 47) ధాటిగా ఆడారు.

బంగ్లా బౌలర్లలో షకీబ్, మెహదీ హసన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బంగ్లాపై ఎదురుదాడే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా భారత్ ఓవర్‌కు 8.2కు  పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.

ఈ క్రమంలో టీమిండియా టెస్టుల్లో తొలి 50, 100, 200 పరుగులను అత్యంత వేగంగా అందుకొని ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం. 200 పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న టీమిండియా.. 2017లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది.

జడ్డూ 300.. కోహ్లీ 27 వేలు

అంతకముందు 107/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో మొమినుల్ హక్ (107 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. చివర్లో మెహదీ హసన్ (20) పర్వాలేదనిపించడంతో బంగ్లా 200 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలా 2 వికెట్లు తీశారు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్ తీసిన జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.  టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఏడో భారత బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. జడ్డూ కంటే ముందు కుంబ్లే (619), అశ్విన్ (524*), కపిల్ దేవ్ (434), హర్భజన్ (417), ఇషాంత్ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు. అంతేకాదు టెస్టుల్లో 300 వికెట్లతో పాటు 3వేల పరుగులు పూర్తి చేసుకున్న జడేజా.. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో క్రికెటర్‌గా జడేజా (74 టెస్టులు) నిలిచాడు.

మొత్తంగా టెస్టులో ఒకే రోజు రెండు జట్లు కలిపి 437 పరుగులు రావడంతో పాటు 18 వికెట్లు నేలకూలడం గమనార్హం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) కలిపి 27వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, సంగక్కర, పాంటింగ్ ఉన్నారు.