- ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి
- ఉదారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు
- అండర్ గ్రౌండ్ సీవరేజీ పనులకు ‘అమృత్-2’ నిధులివ్వాలని విజ్ఞప్తి
- ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర పద్దు
- కేంద్రం కేటాయింపుల మేరకు రాష్ట్ర బడ్జెట్ అంచనా
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి అప్పగించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేస్తోం ది. ఆర్థికపరంగా ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తోంది.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), మెట్రో రెండో ఫేజ్, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ సహా పలు అభివృద్ధి పనులపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టిం ది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నం దున, ఆ బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షే మ పథకాల అమలుకు రూ.1.70 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తుండటంతో, ఆ వ్య యంలో కొంతైనా కేంద్రం ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇతోధికంగా ఇచ్చే నిధుల్లోనూ తెలంగాణకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఉపాధి హామీ పథకం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధు ల వినియోగంలో వెసులుబాటు కల్పించాలని కోరింది.
ఏయే ప్రాజెక్టుల మీదంటే..?
తెలంగాణ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో రెండో ఫేజ్, మూ సీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ పనులను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. ఇందులో భాగంగా రూ.34 వేల కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసింది. నిధుల్లో రూ.7 వేల కోట్లకు విలువైన ఉత్తర భాగాన్ని కేంద్రం నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించాలని అడుగుతున్నది. ఇందుకు అ వసరమైన నిధులను సైతం ఈ బడ్జెట్‌లో నే ప్రతిపాదించాలని కోరింది. అలాగే, ఫ్యూచర్ సిటీని కలుపుకొని మొత్తం రూ. 32 వేల కోట్లతో ప్రభుత్వం మెట్రో రెండో ఫేజ్ పనులు చేపట్టనున్నది.
ప్రాజెక్టును 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేస్తే బాగుంటుందని, అందుకు అనుగుణంగా సగం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. గుజరాత్‌లోని సబర్మతి నది పునరుజ్జీవానికి నిధులు ఇచ్చినట్లుగానే, మూసీ పునరుజ్జీనానికీ కేంద్రం నిధులు ఇవ్వాలని విన్నవిం చింది.
మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా సీవరేజీ ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణానికి రూ.14 వేల కోట్లు అవసరవుతాయని, అందుకు కేంద్రం సహకరించాలని ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్ చుట్టపక్కన 27 మున్సిపాలిటీలతో పాటు వరంగల్ అండర్ గ్రౌండ్ సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను రూ.22 వేల కోట్లు అవసరం అవుతాయని, అమృత్ స్కీమ్ కింద ఈ నిధులు మం జూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
సెమీ కండక్టర్ మిషన్, ఎంఎస్‌ఎంఈలకు సహకారం
హైదరాబాద్‌కు సెమీకండక్టర్ల పరిశ్రమలు తరలివస్తున్నాయని, ఈ క్రమంలో రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ మిషన్‌లో చేర్చి మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. దీనిలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలని, పీఎల్‌ఐ పథకాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది. తెలంగాణ పరిధిలోని 65 ఐటీఐలను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో ఆ పనులకు చేయూ తనందించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో యువతకు నైపుణ్యం కల్పించేందుకు తగినన్ని నిధులను మంజూరు చేయాలని విన్నవించింది.
ప్రత్యేక సాయంకోసం వేడుకోలు..
రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, మూలధన వ్యయానికి ఇచ్చే ప్రత్యేక నిధులతో పాటు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్‌కు కేటాయింపులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, ఉపాధి హామీ పథకంతో పాటు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నిధులను వినియోగంలో వెసులుబాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రమని, రాష్ట్రం ఆర్థిక లక్ష్యాలను అధిగమించేందుకు కావాల్సిన రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని విన్నవించింది. ఇవే కాకుండా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం మరికొన్ని ప్రతిపాదనలు పంపింది. కేంద్రం వచ్చే నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కూడా బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులను బట్టి తన పద్దులో అంచనాలు సిద్ధం చేయనున్నది. తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం అందించే సాయం ఎంతో కీలకం. అందుకే రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నది. కేంద్రం ఇక తెలంగాణకు ఎంత సాయం చేస్తుందో తెలియాలంటే బడ్జెట్ విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.
కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు
* పన్ను స్లాబుల సరళీకరణతో పాటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించాలి
* ఆదాయ పన్నుతో పాటు జీఎస్టీ ఫైలింగ్ సరళీకరణ
* వెనుకబడిన జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం
* వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయానికి ఇతోధికంగా నిధులు విడుదల చేయాలి. బిజినెస్ టు బిజినెస్‌లో 1శాతం సెస్ వసూలు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వానికీ ఆ వెసులుబాటు కల్పించాలి.
* అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంశాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.
* పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
* ఏపీ పునః వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లించాలి.
* ఉమ్మడి సంస్థ నిర్వహణకు ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై స్పష్టత ఇవ్వాలి.
* ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరించాలి.
* తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
* శ్రీశైలంతో హైదరాబాద్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్ 765కు క్లియరెన్స్ ఇవ్వాలి.
* ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు
* హైదరాబాద్ విజయవాడ ఎన్‌హెచ్‌ె 65 విస్తరణకు సహకారం అందించాలి.
* వరంగల్ దక్షిణ భాగంలో బైపాస్ నిర్మించాలి.
* పర్వత్ మాల్ ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి ఆలయం, నాగార్జున సాగర్, హనుమకొండను చేర్చే రోప్ వే ఏర్పాటుకు సహకారం అందించాలి.
* గోదావరి, కృష్ణా నదులపై 10 చోట్ల పంటూన్ బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు అందించాలి.