calender_icon.png 30 November, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ సేఫ్టీ కమిటీ నియామాలు పాటించాలి

29-11-2024 10:00:51 PM

ఎస్సీ డీ డీ రవీందర్ రెడ్డి..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): జిల్లాలోని ఎస్సీ వసతి గృహల్లో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ కమిటీ నియమ నిబంధనలను వసతి గృహ సంక్షేమాధికారులు పాటించాలని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పోటు రవీందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు సమావేశంలో హేచ్ డబ్ల్యూ ఓ లకు ఫుడ్ సేఫ్టీ కమిటీపై మార్గనిర్దేశం చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు వసతి గృహాల్లో ఫుడ్ పాజయినింగ్ పై ప్రభుత్వం కఠిన నిర్ణయాల్లో భాగంగా ప్రతి  గృహంలో ఫుడ్ సేఫ్టీ కమిటీ లను నియమించాలని ఆదేశాలిచ్చిందన్నారు.

దీనిలో భాగంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేస్తున్నట్లు వివరించారు. ఈ కమిటీలో ఆయా వసతి గృహ సంక్షేమాధికారి, కామటి, కుక్, వాచ్ మన్ లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు ఆహర నాణ్యతను పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాతనే విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించాలన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ఖచ్చితంగా విద్యార్థుల సమక్షంలో రుచి చూసి, నిర్ధారించాకే విద్యార్థులకు వడ్డించాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులు బయట నుంచి గాని తమ ఇండ్ల నుంచి తెచ్చుకున్న ఆహార పదార్ధాలను అనుమతించవద్దని కూడా తెలిపారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ట్రంక్ పెట్టెలను పరిశీలించాలన్నారు. విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాకముందే పటిష్ట చర్యలు తీసుకునే బాధ్యత ఆయా వార్డెన్ లదేనని స్పష్టం చేశారు.

అదే విధంగా విద్యార్థులకు అందించే మందులను ఎప్పటికప్పుడు పరిశీలించి గడువు దాటిన మందులను ఎట్టి పరిస్థితిలో వినియోగించవద్దన్నారు. ముఖ్యంగా వసతి గృహ సంక్షేమాధికారులు అందుబాటులో ఉండి, ఉన్నతాధికారులు ఎవరు వచ్చిన అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించని వార్డెన్ లపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సహాయ సాంఘిక సంక్షేమాధికారి రవీందర్ గౌడ్, ఆయా వసతి గృహల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.