26-03-2025 01:52:34 AM
హైదరాబాద్, మార్చి 25(విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)పై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రారంభించింది మేమంటే.. మేమంటూ’ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ఫైల్ 2017లో తమ హయాంలోనే ముందుకు కదిలిందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని..ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ..
తమ చొరవ కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ పనుల కోసం భూసేకరణ పనులకు అనుమతి వచ్చిందని, హైవే నెంబర్ 161ఎ కూడా కేటాయించారని గుర్తుచేశారు. రెండు నెలల్లో అన్ని క్లియరెన్స్‌లు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం తమ ప్రభుత్వం 88శాతం భూసేకరణ చేపట్టిందని తెలిపారు.
ఆర్‌ఆర్‌ఆర్ కోసం రూ. 1500 కోట్లు కేటాయించిందన్నారు. మేము ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మిస్తే బీఆర్‌ఎస్ సర్కారు దానిని అమ్ముకుందని ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం, కొత్త రోడ్లకు అధిక నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.