calender_icon.png 19 January, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుబీనా కంచు మోత

01-09-2024 12:22:57 AM

  1. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం
  2. భారత్ ఖాతాలో ఐదో పతకం
  3. పారిస్ పారాలింపిక్స్

ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో భారత్ షూటర్లు అదరగొడుతున్నారు. రెండో రోజు  మన పారా షూటర్లు దేశానికి మూడు పతకాలు తీసుకురాగా.. మూడో రోజున షూటింగ్ విభాగంలో మరో పతకం వచ్చి చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యంతో మెరిసి జాతీయ జెండాను రెపరెపలాడించింది. దీంతో భారత్ ఖాతాలో ఐదో పతకం వచ్చి చేరినట్లయింది. 

పారిస్: పారాలింపిక్స్‌లో మన భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. రెండో రోజు నుంచే పతకాల వేట మొదలుపెట్టిన మన పారా అథ్లెట్ల జోరు మూడో రోజు కూడా కొనసాగుతోంది. తాజాగా శనివారం పారా షూటింగ్‌లో నాలుగో పతకం వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్ 1) కేటగిరీలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ (211.1 పాయింట్లు) సాధించి కాంస్య పతకం ఒడిసిపట్టింది. ఇరాన్ షూట ర్ జవన్‌మర్డి (236.8 పాయింట్లు), తుర్కి యే షూటర్ ఒజ్గాన్ (231.1 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.

అయితే క్వాలిఫయింగ్ రౌండ్‌లో తొలి సిరీస్ ముగిసేనాటికి 14వ స్థానంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ఫుంజుకున్న రుబీనా 556 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక తుది పోరులో విజృంభించిన రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం గెలుచుకుంది. కాగా పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (ఎస్‌హెచ్ 1) క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వరూప్ హున్ అల్కర్ 613.1 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు.

శుక్రవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎస్‌హెచ్ 1లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా.. మోనా అగర్వాల్ కాంస్యంతో మెరిసింది. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్ 1) ఫైనల్లో మనీశ్ నర్వాల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.

ఎవరీ రుబీనా?

పారిస్: పారాలింపిక్స్‌లో పిస్టల్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా షూటర్‌గా రుబీనా ఫ్రాన్సిస్ రికార్డులకెక్కింది. కాగా కాంస్యంతో మెరిసిన రుబీనా ఫ్రాన్సిస్‌ది మధ్యప్రదేశ్. అంగవైకల్యంతో పుట్టిన రుబీనా షూటర్‌గా ఎదగడంలో ఆమె తండ్రి సిమోన్ ఫ్రాన్సిస్ పాత్ర కీలకం. ఒక మెకానిక్ అయిన సిమోన్.. షూటింగ్‌పై కూతురుకున్న ఇష్టాన్ని కనిపెట్టి ప్రోత్సహించాడు. భారత షూటర్ గగన్ నారంగ్‌ను ఆదర్శంగా తీసుకున్న రుబీనా 2015లో పారా షూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ తండ్రి ప్రోత్సాహంతో 2017లో గ్లోరీ అకాడమీలో చేరిన రుబీనా ప్రముఖ కోచ్ జస్పాల్ రానా శిక్షణలో మరింత రాటు దేలింది.

2018 ఫ్రాన్స్ వరల్డ్‌కప్ ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. లిమా వేదికగా జరిగిన 2021 ప్రపంచకప్‌లో విజేతగా నిలవడం ద్వారా టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. పారాలింపిక్స్‌లో పిస్టల్ విభాగంలో పోటీ పడిన తొలి భారత అథ్లెట్‌గా రుబీనా రికార్డులకెక్కింది. అయితే టోక్యోలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత ఆసియా పారా గేమ్స్‌లో (2022) కాంస్యంతో మెరిసి సత్తా చాటింది. 2023 షూటింగ్ ప్రపంచకప్‌లో పి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతం, పి మిక్స్‌డ్ 10 మీ ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత 2022లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో రుబీనా ఒక స్వర్ణంతో పాటు రెండు రజతాలు, ఒక కాంస్యం దక్కించుకొని చరిత్ర సృష్టించింది.

పారాలింపిక్స్‌లో నేటి భారతీయం

పారా అథ్లెటిక్స్

పురుషుల షాట్‌పుట్ ఎఫ్ 40 ఫైనల్

పురుషుల హై జంప్ టీ47 ఫైనల్

మహిళల 200 మీ టీ35 ఫైనల్

పారా రోయింగ్

మిక్స్‌డ్ పీఆర్ 3 డబుల్ స్కల్స్ 

ఫైనల్ ఈవెంట్

పారా షూటింగ్

మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ 

ఫ్రోన్ ఎస్‌హెచ్ 1, ఎస్‌హెచ్ 2 

క్వాలిఫికేషన్ రౌండ్

పారా ఆర్చరీ

పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ 

1/8 ఎలిమినేషన్ రౌండ్

పారా టేబుల్ టెన్నిస్

మహిళల సింగిల్స్ డబ్ల్యూఎస్4 

ప్రిక్వార్టర్స్

మహిళల సింగిల్స్ డబ్ల్యూఎస్3 

ప్రిక్వార్టర్స్

పారా బ్యాడ్మింటన్

మహిళల సింగిల్స్ (ఎస్‌ఎల్ 

ఎస్‌ఎల్ క్వార్టర్ ఫైనల్స్

పురుషుల సింగిల్స్ (ఎస్‌ఎల్

ఎస్‌ఎల్ సెమీఫైనల్స్