07-04-2025 01:00:08 AM
మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీదే తుది నిర్ణయమని పీసీసీ చెప్పడం సిగ్గుచేటు
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ తొలుత తన నివాసంలో, ఆ తరువాత కరీంనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయం నుండి ఏఐసీసీ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసీసీ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటన్నారు.
“రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు? ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారమని, కానీ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించ డమేమిటని, సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను అధిగమించిన పార్టీ బీజేపీ అని, వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. జాతీయ భావజాలం, సిద్ధాంత బలమే బీజేపీ ఈ స్థాయికి చేరిందన్నారు.
2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా అవతరించిందనీ, 16 రాష్ట్రాల్లో సొంతంగా, 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తునామన్నారు. వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశ సత్తా చాటామని, స్వర్ణ చతుర్భుజీ పేరుతో జాతీయ రహదారులను విస్తరించిన ఘనత బీజేపీదేనని, చిట్టచివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న దీన్ దయాళ్ ఆశయాలను కొనసాగిస్తున్నామన్నారు. మోదీ పాలనలో భారత్ ఆర్ధిక ప్రగతి లో అద్బుత ఫలితాలను కనబరుస్తోందని, అభివ్రుద్ధి, సంక్షేమంలో దేశం దూసుకుపోతోందన్నారు.
కేంద్ర సంక్షేమ పథకాలను పూర్తిగా తెలంగాణలో అమలు చేయడం లేదని, అన్ని రాష్ట్రాలను సమాన థ్రుక్పథంతో చూస్తూ అభివ్రుద్ధి చేస్తున్న ప్రభుత్వం మోదీదేనని అన్నారు. రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇచ్చేది మోదీ బియ్యమేనని, కిలో కు రూ.37 లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మోదీదేనని, సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.10 లే. అట్లాంటప్పు డు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో ఎందు కు పెట్టకూడదు?. రూ.10లకు కిలో సన్నబియ్యం ఎక్కడైనా వస్తాయా?. ఆ విష యాన్ని తెలుసుకుని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడితే మంచిదని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టిందను, 6 గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందన్నారు.
ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారారు. జన్ పథ్, గాంధీభవన్ ద్వారా పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారనీ, పాలనపై సీఎంకు పట్టులేకుండా పోయిందన్నారు. హెచ్ సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణమని, కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయాల్సిన సమయం ఆస న్నమైందన్నారు.హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటై మజ్లిస్ ను గెలిపించాలనుకుంటున్నయని, హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీపడుతున్నాయని అన్నారు. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్... దేశభక్తి పార్టీ బీజేపీ అని, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఎవరి పక్షాన నిలబడి ఓటేస్తారో... హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఆలోచించాలని కోరారు.
బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నడో కుమ్కక్కైనాయని, చెన్నయ్ లో డీలిమిటేషన్ మీటింగ్ కు రెండు పార్టీలు కలిసే హాజరయ్యాయని, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయని అన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.