calender_icon.png 14 October, 2024 | 3:55 AM

నత్తనడకన ఆర్‌యూబీ పనులు

14-10-2024 01:15:45 AM

మేడ్చల్‌లో ఐదేళ్లుగా సాగుతున్న నిర్మాణం

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

మేడ్చల్, అక్టోబర్ 13: మేడ్చల్ పట్టణం లో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి.

రైల్వే ట్రాక్ అవతలి వైపు మేడ్చల్‌కు చెందిన 6 కాలనీలు, 5 గ్రామాలున్నాయి. ప్రధాన దారిలో ఆర్‌యూబీ పనులు కొనసాగుతుండటంతో ఈకాలనీల రాకపోకలకు ఇబ్బందిగా మారిం ది. అయితే జూనియర్ కళాశాల వద్ద వరద నీరు వెళ్లడానికి నిర్మించిన చిన్న అండర్‌పాస్ నుంచి గ్రామాలకు బైక్‌లు, చిన్నకార్లు వెళ్తున్నాయి.

అయితే ఇది కూడా ఇరుకుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అండర్ పాస్ వద్ద మలుపు ఉండటం వల్ల ఎదురు గా వచ్చే వాహనాలు కనిపించవు. రైల్వే ట్రాక్ అవతలి వైపు రైల్వేకాలనీ, సరస్వతీనగర్, ఎల్లమ్మతోట, మెట్రో లైన్, సీసీఐ కాలనీ, వడ్డెరబస్తీలు.. గిర్మాపూర్, బర్మాజీగూడ, రాయిలుపూర్, బండ మాదారం, శ్రీరంగవరం గ్రామాలున్నాయి.

ఆయూ బీ పనుల కారణంగా ఈకాలనీలు, గ్రామాల నుంచి పెద్ద కార్లు, అంబులెన్స్‌లు, ట్రాక్టర్లు, లారీలు మేడ్చల్ చేరుకోడానికి గౌడవెల్లి లేదా డబీల్‌పూర్ మీదుగా వెళ్లాల్సివస్తోంది. రాయిలాపూర్ నుంచి మేడ్చల్ ఐదు కిలోమీటర్లు కాగా, చుట్టూ 10 కిలోమీటర్లు ఎక్కువ తిరగాల్సి వస్తోంది.

అండర్ పాస్‌తో సమస్యలే..

అండర్‌పాస్ నిర్మాణం చేపట్టే ప్రాం తం లో తాగునీటి పైప్‌లైన్ ఉండటం వలన పను ల్లో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. వాస్తవానికి ఇక్కడ అండర్ పాస్ నిర్మాణమే సరైంది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వర్షం కురిసిన సమయంలో తరచూ అండర్ పాస్ లో నీరు నిలువడం వల్ల ఇబ్బందవుతుంద ని, అంతేగాక ఇరుకు రోడ్డులో వెళ్లడం కూడా సమస్య అవుతుందంటున్నారు.

అండర్‌పాస్‌కు బదు లు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌వోబీ) నిర్మిస్తే బాగుండేదని అంటున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ దృష్టి పెట్టి అండర్ పాస్ పనుల ను వేగవంతం చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్ వచ్చినపుడు పనులు పరి శీలించాలని, ఆర్‌వోబీ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని కోరుతున్నారు.