calender_icon.png 29 September, 2024 | 5:44 AM

ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్లను నియమించాలి

29-09-2024 01:12:35 AM

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ల నియామాకాన్ని వెంటనే చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రధాన కమిషనర్, కమిషనర్లకు విషయపరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవముండాలని సెక్షన్ 15(5) నిర్ధేశిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్ 2020, ఆగస్టు 24న, మిగిలిన ఐదుగురు కమిషనర్లు 2023, ఫిబ్రవరి 24న పదవీవిరమణ చేశారని, దీంతో 18 నెలలుగా కమిషనర్ కార్యకలాపాలు నిర్వహించడం లేదని వెల్లడించారు. తాము వేసిన పిల్‌పై హైకోర్టు స్పందిస్తూ త్వరలో నియామకం జరుగుతుందని తెలిపినా.. ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాన కమిషనర్, కమిషనర్లు లేకపోవడంతో సుమారు 15 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, అధికారులు కూడా దరఖాస్తులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.