08-02-2025 08:00:58 PM
హయత్ నగర్ డిపోలో గేట్ మీటింగ్...
ఎల్బీనగర్: హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. హయత్ నగర్ డిపోలో శనివారం వన్ చేంజ్ ఓవర్ సమయం సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. గేట్ మీటింగ్ లో జేఏసీ నాయకుడు కత్తుల యాదయ్య మాట్లాడుతూ... హక్కుల సాధనకు సమ్మెకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని, 2021 పే స్కేలు వెంటనే చేయాలని, 2017 పే స్కేల్ ఏరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సెటిల్మెంట్ వెంటనే చెల్లించాలని, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని, సిసిఎస్ ఎస్ఆర్బిఎస్ పీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ జేఏసీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి.రాములు, ఆమనగంటి వెంకన్న, వెంకట్, దశరథ, ప్రసాద్ యు.పి.చారి. ప్రకాశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.