ఆదిలాబాద్,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు నిరసన(RTC employees protest)కు దిగారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం ఎస్.డబ్ల్యు.ఎఫ్, ఎస్.డబ్ల్యూ.యూ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు చేపట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన కార్మిక చట్టాలను రద్దు చేయాల, కార్మికులకు అనుకూలంగా చట్టాలను తయారు చేయాలని కార్మిక సంఘాల నేతలు అన్నారు.
ఒకపక్క పని గంటలు పెంచి, ఆర్థిక ప్రయోజనాలు తగ్గించి యాజమాన్యాలు కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేస్తు, కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వం సైతం ఆర్టీసీ(Telangana State Road Transport Corporation)లో సంఘాల కార్యకలాపాలను అనుమతించలేదని, అదికారులు కార్మికులతో వెట్టి చాకిరి చేయించారని ఆరోపించారు. కార్మికులు కన్నెర్ర చేస్తే గద్దె దిగి పోవాల్సి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వమైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ నిరసనలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపెల్లి భీమ్ రావ్, రీజియన్ అధ్యక్షులు సర్పె భీమ్ రావ్, డిపో కార్యదర్శి ఆశన్న తదితరులు ఉన్నారు