ప్రధాన ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో ఆర్టీసీ ప్రయాణ సేవలు మరింత మెరుగుపడేలా ఆర్టీసీ యాజమాన్యం కృషి చేయాలని, ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించి ప్రజల ప్రయాణ కష్టాలని తీర్చాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం డిపో నుంచి హైద్రాబాద్ మియాపూరుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఇంద్రా ఏసి బస్సులు శుక్రవారం అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ.. చాలా ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ ప్రయాణ సేవలను అందించే పరిస్థితి లేదని, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని బస్సులను రద్దు చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారన్నారు.
ప్రవేటు బస్సులు, ఇతర ప్రైవేటీ వాహనాల నుంచి ప్రజల ద్రుష్టి మళ్లించి మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆర్టీసీ బలోపేతం చేయాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల నుంచి ఇతర నగరాలకు, పట్టణాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలనీ, గతంలో రద్దు చేసిన హైదరాబాద్ సర్వీసులను పునరుద్దరించాలని అధికారులకు సూచించారు. కొత్తగూడెం బస్టాండును నూతన హంగులతో నిర్మించేందుకు సంబంధిత అధికారులకు, మంత్రులకు ప్రతిపాదలను అందించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సునీత, కంట్రోలర్లు వై నాగేశ్వరరావు, జాకబ్, నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, భూక్యా దస్రు, యూసుఫ్, జక్కుల రాములు, నేరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.