calender_icon.png 7 October, 2024 | 6:56 AM

ప్రెవేటు దిశగా ఆర్టీసీ?

07-10-2024 02:16:36 AM

అద్దె బస్సులు ప్రారంభించి సొంతవాటిలా ప్రచారం 

కొత్త బస్సుల కొనుగోలులో యాజమాన్యం వెనుకంజ

వెయ్యి ప్రైవేటు ఈవీ బస్సులు ప్రవేశపెట్టే ప్రక్రియ 

మహాలక్ష్మి పథకం బస్సులపై చిన్నచూపు

సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపైనే సంస్థ దృష్టి 

ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం కలేనా?

హైదరాబాద్, అక్టోబర్ ౬ (విజయక్రాంతి) : ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడు గులు వేస్తోందా? అంటే అవుననే సమాధానం కార్మిక వర్గాల నుంచి వినిపి స్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు ఆశలు పెట్టుకోగా.. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడినప్పటి నుంచి అందుకు విరు ద్ధ కార్యాచరణ కనిపించడంతో పరిస్థితు లు తలకిందులైనట్టు భావిస్తున్నారు.

గత ప్రభుత్వం తమకు  అన్యాయం చేసిందన్న ఆవేదనలో ఉన్న కార్మికులకు.. తాజా పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడిన ట్టుగా మారింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల కరీంనగర్, నిజామాబాద్‌లో అద్దె బస్సులను ప్రారంభించి.. అదేదో సంస్థ స్వంత బస్సుల్లా ప్రచారం చేసుకోవడంపై కార్మికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

కాంగ్రెస్ సర్కా రు వచ్చిన తర్వాత ఆర్టీసీ తరఫున కొత్తగా బస్సులనే కొనుగోలు చేయలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సుల పేరిట చేస్తున్న హంగామా చూస్తే సంస్థకి పొగబెట్టే కార్యక్రమం నడుస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ ట్రేడ్ యూనియన్ కూడా పునరుద్ధరించలేద ని..

దశలవారీగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నట్టు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆర్టీసీ ఉంటుం దా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ హామీగానే మిగిలిపోయింది.

ఆక్యుపెన్సీ రేషియో రెట్టింపు

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గతంలో కంటే ఆక్యుపెన్సీ రేషియా ఇప్పుడు దాదాపుగా రెట్టింపైంది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 19న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించిన వారి సంఖ్య అక్షరాల 63 లక్షలు. వీరిలో మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 41.74 లక్షలు.

ఒక్క రోజున 38 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. మహాలక్ష్మి ద్వారా రూ.17 కోట్లు, రెగ్యులర్ టిక్కెట్ల ద్వా రా రూ.15 కోట్ల ఆదాయం వచ్చింది. అదే సమయంలో అర్టీసీలో పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది సంఖ్య పెరుగుతూనే ఉం ది. కానీ కొత్తగా నియామకాలు లేవు. అడపాదడపా కొత్త బస్సులను తెస్తున్నా... కాలం చెల్లిన బస్సుల తొలగింపు కొనసాగుతోంది.

ఫలితంగా బస్సుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. ఈ ఏడాది జూన్ నాటికి ఆర్టీసీలో 40,415 మంది సిబ్బంది ఉండగా.. 9,149 బస్సులున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆర్టీసీకి 10,450 బస్సులుండేవి. 57, 254 మంది కార్మికులుండేవారు. ఇప్పుడు బస్సు లు, కార్మికులు తగ్గిపోయారు. మరోవైపు గతంలో అద్దె బస్సులు 1,431 మాత్రమే ఉంటే ఇప్పుడవి 2,750కి చేరుకున్నాయి.  

1000 ఈవీ అద్దె బస్సులు 

పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సి ఉన్నా.. ఆర్టీసీ ఆ దిశగా దృష్టి సారించడం లేదని కార్మికులు అంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక స్క్రాప్ బస్సుల స్థానంలో కొత్తవి తెచ్చింది కానీ అదనపు బస్సులు తేలేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఆరోపించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టకుండా యాజమాన్యం ఈవీ బస్సుల పేరిట ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ సూపర్ లగ్జరీ బస్సులను ప్రవేశపెడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.  

ఒక్కో బస్సుకు ఆరుగురు కార్మికులు 

ఆర్టీసీ నిబంధనల మేరకు ఒక బస్సుకు ఆరుగురు కార్మికులు సేవలు అందించాలి. ప్రైవేటు బస్సులు పెరిగితే క్రమంగా ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కార్మికులు చెప్తున్నారు. వెయ్యి బస్సులు ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా వస్తున్నాయంటే 2 వేల మంది డ్రైవర్లను, వెయ్యి మంది శ్రామిక్‌లను, మరో వెయ్యి మంది హెల్పర్లను ఆర్టీసీ కోల్పోయినట్టేనని వాపోతున్నారు.  

94 కోట్ల మంది.. 3500 కోట్ల ఆదాయం 

ఈ నెల 4న నిజామాబాద్‌లో ఆర్టీసీ ప్రైవేటు ఈవీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తూ చెప్పిన లెక్కల ప్రకారం.. మహాలక్ష్మి ప్రారంభమైనప్పటి నుంచి ౪ వ తేదీ వరకు 94 కోట్ల మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. ఫలితంగా ఆర్టీసీకి రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. రెగ్యులర్ ప్రయాణికుల ద్వారా కూడా మంచి ఆదాయమే వస్తోంది.

అంతకుముందు సెప్టెంబర్ 30న కరీంనగర్‌లోనూ మంత్రి 35 ఈవీ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. కరీంనగర్ వేదిక పైనుంచి మంత్రి చెప్పిన ప్రకారం దశలవారీగా ఆర్టీసీలో ఈవీ బస్సులు 2,400 రానున్నాయి.

దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ ఈవీ బస్సులనే ప్రవేశపెట్టనున్నట్టు ఆర్టీసీ ఎండీ కూడా ప్రకటించారు. అయితే, వాటిని ప్రైవేటు ఆపరేటర్ల ద్వారానే ప్రవేశపెడతారని సమాచారం. ఆర్టీసీ బస్సులే లేనప్పుడు సిబ్బంది ఎక్కడ ఉంటారు అనేది కార్మికుల ప్రశ్న.  

3వేల పోస్టులు బోగస్ 

3 వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం. కార్మికుల కొరత తీరుతుందని మంత్రి, ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించడం బోగస్. పుం డు ఓ చోట అయితే మందు ఇంకో చోట రాసినట్టు ఆర్టీసీ యాజమాన్యం తీరు కనిపిస్తోంది. ప్రైవేటు బస్సులను ప్రారంభించి అదేదో తమ గొప్పగా చెప్పుకొంటున్న తీరు చూసి జనం నవ్వుకుంటున్నారు.

ఇప్పటికే నియామకాలు ఆపేశారు. కొత్త బస్సులు కొనడం లేదు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ పునరుద్ధరించలేదు. కార్మికులకు రావాల్సిన బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సంస్థను ప్రైవేటీకరణ పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోంది.  

 ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 800 బస్సులు

ఆర్టీసీ పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. మా కష్టాలు తీరుతాయని భావించినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. స్క్రాప్ బస్సుల స్థానంలో మాత్రమే కొత్త బస్సులు వస్తున్నాయి. అదనపు బస్సులు కొనట్లేదు. అదే సమయంలో ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా పెద్దఎత్తున ఈవీ బస్సులను తీసుకువస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 800 ఈవీ బస్సులు వస్తున్నాయి. జిల్లాల్లో కూడా 200 బస్సులు తీసుకువస్తున్నారు. ఈవీ బస్సుల కాంట్రాక్టు విధానం బయటకు చెప్పడం లేదు. యాజమాన్యం దృష్టి ప్రైవేటీకరణ వైపే సాగుతోందని స్పష్టంగా అర్థం అవుతోంది.

                             థామస్ రెడ్డి, 

                   ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్