24-02-2025 01:04:52 AM
నేటి నుంచి మార్చి 1 వరకు ఉత్సవాలు
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
మేడ్చల్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈనెల 24 నుంచి మార్చి ఒకటి వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవాలకు, శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం పాలకమండలి పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఆలయం వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎండ తగలకుండా వాటిపై చలువ పందిళ్లు వేశారు. 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉండేలా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు ఏర్పాటు చేశారు. ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ అధికారులు తీసుకున్నారు. సుమారు 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్ తటాకం భాను శర్మ తెలిపారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలోని ఈసీఐఎల్, ఉప్పల్, సికింద్రాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వాహనాలకు పార్కింగ్, భక్తులకు ఇబ్బందులు కలగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.