07-02-2025 12:36:33 AM
* ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్‌చైర్మన్ థామస్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఇప్పటి వరకు ఆర్టీసీ సమ్మెపై తాము ఇచ్చిన నోటీసుకు యాజమాన్యం నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన లేదని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా తమ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం సీబీఎస్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడారు. గత నెల 27న సమ్మె నోటీసు ఇచ్చామని ఇప్పటివరకు యాజమాన్యం, ప్రభుత్వం నుంచి స్పందన లేదని వారు తెలిపారు. లేబర్ కమిషనర్ కూడా ఈ సమ్మెపై వెంటనే స్పందించి యాజమాన్యంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాల్సింది పోయి 10 రోజులు దాటినా ఇంకా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
ఇదే పరిస్థితి కొనసాగితే లేబర్ కమిషనర్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉనికికే ప్రమాదమైన ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసి అందించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ కావొద్దనేదే తమ ప్రధాన ఉద్ధేశమన్నారు. ప్రజా రవాణాను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉన్న రవాణా సేవలు భవిష్యత్తులో ఎంతో ఖరీదువుతాయన్నారు.