calender_icon.png 24 October, 2024 | 4:52 AM

ఆర్టీసీ విలీనాన్ని అమలు చేయాలి

24-10-2024 02:19:43 AM

టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, కేసీఆర్ సర్కార్ రద్దు చేసిన ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు.

పెంచిన పని భారాన్ని తగ్గించి మోటార్ వెహికిల్ యాక్ట్‌ను అమలుపరచాలని, కార్మికులు పొదుపు చేసుకున్న డబ్బులను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో జరిగిన టీజేఎంయూ కేంద్ర కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడారు.

2013 కు సంబంధించిన వేతన సవరణ బకాయి బాండ్ డబ్బులు చెల్లించడం, 2017 వేతన సవరణ చేయడం, సీసీఎస్‌లో లోన్లు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీజేఎంయు రాష్ట్ర నూతన అధ్యక్షులుగా డీవీకే రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్వాములయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనయ్య, ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్, అడిషనల్ జనరల్ సెక్రెటరీగా ప్రేమ్‌నాథ్,  ఉపాధ్యక్షులుగా గోలి రవీందర్, జల్దా వెంకటేశ్వర్లు, రాష్ర్ట సంయుక్త కార్యదర్శులుగా పీకే మూర్తి, వల్కే కల్యాణి, అరుణ, రాష్ర్ట సలహాదారులుగా సాయిలు, సురేందర్, యాదగిరి, రాష్ర్ట కార్యదర్శులుగా ఆర్‌ఎన్ రావ్, అతిక్, లాలు నాయక్, నజీరుద్దీన్, ఆసిఫాబాద్ సుధాకర్, హనుమంతరావు, చంద్రశేఖర్, జీవన్‌రామ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.