calender_icon.png 25 October, 2024 | 1:46 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

28-08-2024 12:30:01 AM

మేనిఫెస్టోలోని హామీలను వెంటనే అమలు చేయాలి

నల్లబ్యాడ్జ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీకు అనుగుణంగా తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజేఎస్‌ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాం డ్లు, డిపోల ఎదట ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జ్జీలు ధరించి నిరసన తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్, జేబీసీ, తార్నాక డిపోల వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కోకన్వీనర్లు సుద్దాల సురేష్, యాదయ్య, జేఏసీ ప్రతినిధులు రఘురాం, పీబీ రావు, రాములు మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం చట్ట విరుద్ధం గా కార్మికుల చేత 16 గంటలు పనిచేయూ స్తూ కార్మికులమీద మోయరాని పనిభారం మోపుతోందన్నారు. 2013 వేతన బకాయిలను కేవలం డ్రైవర్లకు మాత్రమే చెల్లించి మిగతా ఉద్యోగులకు గడిచిన 6 నెలలుగా చెల్లించడంలో జాప్యం చేస్తోందన్నారు.

గత పదేళ్లుగా వివిధ కారణాల చేత సుమారు 13వేల మంది కార్మికులు ఆర్టీసీ నుంచి వైలదొలగినప్పటికీ వారి స్థానంలో తిరిగి కొత్త నియామకాలు చేపట్టలేదన్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పనిభారం పెరిగిపోయిందన్నారు. మహాలక్ష్మి పథకం అమలు మొదలు నుంచి డ్రైవర్, కండక్టర్లపై ఒత్తిడి అధికమైందన్నారు. ఉద్యోగం నుంచి తొలగించేందుకు యాజమాన్యం కార్మికులపై కావాలనే కేసులు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు యాజమాన్యం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు.