04-03-2025 04:33:31 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించేందుకు ముందుకు వచ్చింది. తొలి విడతలో 150 మహిళా సంఘాలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను ప్రభుత్వం అందించనుంది. ఈ బస్సుల ద్వారా మహిళలు తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడంతో పాటు, స్వయం ఉపాధిని మరింత విస్తరించుకునే అవకాశాన్ని పొందనున్నారు. ప్రతి బస్సుకు ప్రభుత్వం రూ. 77,220 అద్దె చెల్లించనుంది. మహిళా సంఘాలు(Women's associations) తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకునేందుకు, రవాణా సమస్యలు లేకుండా అనేక ఆవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ బస్సులు బలమైన వేదికగా మారనున్నాయి. అంతేకాదు, బస్సుల కొనుగోలుకు అవసరమైన బ్యాంకు గ్యారంటీను కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఈ నిర్ణయం ద్వారా మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేయడానికి అవకాశం లభించనుంది. స్వయం సహాయక సంఘాలకు కొత్త అవకాశాలను అందించడంలో ఇది మార్గదర్శకంగా నిలవనుంది. మహిళా సంఘాలు సాధికారత సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ బస్సుల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడంతో పాటు, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించగలరు. ప్రభుత్వ అనుకూలతతో, ఆర్టీసీ సహాయంతో మహిళలు మరింత స్వావలంబన దిశగా ప్రయాణించనున్నారు. ఇది కేవలం బస్సుల కేటాయింపు మాత్రమే కాదు, మహిళా సాధికారతకు ఒక ఉద్యమం అని ప్రభుత్వం పేర్కొంది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు, సమాజంలో గౌరవప్రదమైన స్థాయిని సాధించేందుకు ప్రభుత్వం ఇచ్చిన సుజ్ఞాన సంకేతం. ఈ నిర్ణయం ద్వారా ప్రతి మహిళా సంఘం మరింత బలోపేతం అవ్వాలి, అభివృద్ధి చెందాలి, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం మహిళా శక్తిని మరింత వెలుగులోకి తెచ్చే కొత్త ఆరంభం కానుంది.