calender_icon.png 2 April, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ హమాలీ పోర్టర్స్ కూలీ రేట్లు పెంచాలి

30-03-2025 12:00:00 AM

  1. కనీస సౌకర్యాలు కల్పించాలి
  2. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు వినతి
  3. బస్సు భవన్ ఎదుట  జరిగిన ధర్నాలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా డిమాండ్

ముషీరాబాద్, మార్చి 29: (విజయ క్రాంతి): నిజాం కాలంలో ఆర్టీసీ సంస్థ ఏర్పాటు అయినప్పటి నుండి సంస్థలో హమాలీ వ్యవస్థ కొనసాగుతున్నదని, గత అనేక సంవత్సరాలుగా అమలు అవుతున్న బస్తా రేటు ను 2023 సంవత్సరంలో 10 రూపాయలు ఉన్నటువంటి బస్తా రేటును 5 రూపాయలకు తగ్గించటం తీవ్ర అన్యాయమని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 15 రూపాయల పెంచాలని మాజీ రాజ్యసభ సభ్యులు, సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీజీఎస్ ఆర్‌టీసీ లైసెన్సు రిపోర్టర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో శనివారం బస్ భవన్ ఎదుట భారీ ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణికులతో పాటు రవాణా వ్యవస్థ ద్వారా ఆర్టీసీకి అనేక లాభాలు వస్తున్నాయని, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కార్గో సంస్థలో రవాణా సంస్థ లాభదాయకంగా నడుస్తున్నదని, కానీ కార్మికుల కూలీ రేట్లు మాత్రం సగాని సగం తగ్గించడం ద్వారా వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని  విమర్శించారు.

వందలాదిమంది హమాలి పోర్టర్లు సీబీస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ లాంటి బస్టాండ్లతో పాటు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల సరుకుల్ని రవాణా చేసేందుకు కృషి చేయుచున్నారని  పేర్కొన్నారు. గతంలో ఉన్న ఏఎన్‌ఎల్ ప్రైవేట్ సంస్థ లాంటి సంస్థల్లో కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీరేట్లను పెంచే వారిని ప్రస్తుతం కార్పొరేషన్ ద్వారా నడుస్తున్న కార్గోలో  కార్మికుల శ్రమ దోపిడి జరుగుతున్నదని ఆరోపించారు.

ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మాట్లాడుతూ హమాలీలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 20 శాతానికి తగ్గకుండా కూలీ రేట్లు పెంచాలని, ప్రతి పోర్టర్ కార్మికుడికి రెండు జతల యూనిఫారం సంస్థ ద్వారా ఇప్పించాలన్నారు. అనంతరం ఆర్టిసి వీసీ సజ్జనార్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

సానుకూలంగా స్పందించిన సజ్జనార్  వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, ఉప ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, యూనియన్ ఉపాధ్యక్షులు జి. దాసు, వి పోచయ్య, కే. కొండయ్య ఇ. దశరథ్, కే. చంద్రమౌళి, జి. నరసింహ పాల్గొన్నారు.