ఈసీఐల్ నుంచి ఎల్బీనగర్ వరకు జర్నీ
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం నుంచి దూరప్రాంతాలకు ప్రయాణించే తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా పికప్ వాహనాలను శుక్రవారం నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఈసీఐల్ నుంచి ఎల్బీనగర్ మధ్యలో ఉన్న ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూ రు, కందుకూరు మార్గాల్లో ప్రయాణించే వారి కోసం పికప్ వ్యాన్స్ సదుపాయాన్ని తీసుకువచ్చింది.
కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలి హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్ బస్టాప్, హెచ్‌ఎంటీ నగర్, నాచారం బస్టాప్, హబ్సిగూడ బస్టాప్, ఉప్పల్ మెట్రో స్టేషన్, నాగోలు సుప్రజ హాస్పిటల్, ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ స్టాప్స్‌లో ఈ పికప్ వ్యాన్లు ఆగుతాయన్నారు. ఈ పికప్ వ్యాన్ల కోసం ముందస్తుగా www.tgsrtc.in ద్వారా లేదా సమీప ఆర్టీసీ టికెట్ ఏజెంట్ల వద్ద, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌షుక్‌నగర్ బస్‌స్టేషన్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 040 69440000 నెంబర్‌కు సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.