కసరత్తు ముమ్మరం
మంత్రుల మంతనాలు
పైలెట్ ప్రాజెక్టుగా మహబూబ్‌నగర్, కరీంనగర్ ఎంపిక
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మహిళా సంఘాలకు ఆర్థికంగా బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నది.
మంగళవారం సచివాయలంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రవాణా శాఖ, పీఆర్ అండ్ ఆర్‌డీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధివిధానాలపై ఉన్నతాధికారులతో చర్చ నిర్వహించారు.