* మంత్రివర్గ సమావేశంలో సీఎం చర్చించాలి
* టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 30న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, వారికిచ్చిన హామీలపై చర్చించాలని టీజీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ కత్తుల యాదయ్య మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమా వేశాల్లో ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల సమస్యలను చర్చకు రాకుండా చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు ఏడాది పూర్తయిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప హామీల అమలు విషయమే పట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని, యూనియన్ల పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2021 వేతన సవరణతో పాటు నూతన నియామకాలు చేపట్టాలని కోరారు. పెండింగ్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలన్నారు.
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లించాల్సి ఉందని, వాటి విడుదలలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదన్నారు. కార్మికులకు నూతన సంవత్సర కానుకగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.