calender_icon.png 3 April, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

31-03-2025 12:00:00 AM

ఒకరి మృతి, ముగ్గురుకి తీవ్ర గాయాలు

కల్లూరు, మార్చి 30:- డ్యూటీ ముగించుకొని  ఉగాది పండుగ సందర్భంగా త్వరగా ఇంటికి చేరుకోవాలని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ఇంటికి బయలుదేరిన బస్ కండక్టర్‌ని విధి వక్రీకరించి మృత్యువు కబళించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగి న రోడ్డు ప్రమాదంలో బస్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వన్నపూరపు సీతారాం ప్రసాద్ మృతి చెందాడు. సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా  విధులు నిర్వహిస్తున్న కల్లూరు చెందిన వన్నపూరపు సీతారాం ప్రసాద్ తన డ్యూటీ ముగించుకున్నాడు. డ్యూటీ దిగి ఆదివారం తెల్లవారుజాము సమయంలో స్వగ్రామం కల్లూరు కి వెళ్లాలని హైదరాబాద్ బస్సు ఎక్కాడు. అంతలో విశాఖపట్నం నుండి ఖమ్మం వెళ్తున్న ఖమ్మం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సత్తుపల్లి బస్టాండ్ కి చేరుకుంది.

సూపర్ లగ్జరీ బస్సులో త్వరగా ఇంటికి చేరుకోవచ్చని ఎక్కిన బస్సు దిగి సూపర్ లగ్జరీ బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరి కిష్టారం దాటి  పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి శివారుకి చేరుకోగానే జాతీయ రహదారిపై పక్కన నిలిపి ఉన్న ఆయిల్ ట్యాంకర్  వెనక భాగంలో  వేగంగా ఢీ కొట్టడంతో బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్ సీతారాం ప్రసాద్ కి, మరో ఇద్దరికి , ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన ఉదయ్ కు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. మరో పురుషుడు, మహిళను ఘటనా స్థలం నుండి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న ట్యాంకర్ లారీ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ పి. అప్పారావు  తెలిపారు.