10-02-2025 04:37:41 PM
మంచిర్యాల (విజయక్రాంతి): పెన్షన్ రావడం లేదని కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ లో ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడి బావ రామగిరి సమ్మయ్య తెలిపిన వివరాలు ప్రకారం... కోటపల్లి మండలం జనగాం గ్రామానికి చెందిన చెన్నూరు లక్ష్మణ్ కు మాటలు సరిగా రావు. ఇటీవల తను రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు లక్ష్మణ్ తన బావ సాయంతో మంచిర్యాలకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండ్ కు వచ్చారు.
లక్ష్మణ్ చెన్నూరు వైపు వెళ్లే బస్సులో సీటు ఆపేందుకు ప్లాట్ ఫామ్ వైపునకు వస్తున్న బస్సుకు ఎదురుగా వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. బస్సు ముందు టైరు అతనిపై ఎక్కడంతో రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ లో లక్ష్మణ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.