06-03-2025 11:37:25 PM
ముంబైలో బతికేందుకు మరాఠీ అవసరం లేదు
ముంబై: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల భాషా వివాదం నడుస్తోన్న వేళ ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో బతికేందుకు మరాఠి భాష అవసరం లేదనడం వివాదానికి దారి తీసింది. గురువారం మహారాష్ట్రలోని ఘట్కోపర్‌లో జరిగిన కార్యక్రమంలో భయ్యాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన స్పష్టత ఇచ్చారు. ‘ముంబై ఒకే భాషకు పరిమితం కాలేదు. ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడుతారు. సమావేశం జరుగుతున్న ఘట్కోపర్ ప్రాంతంలో గుజరాతీలు ఎక్కువగా ఉంటారు.
అందుకే ముంబైలో నివసించాలంటే మరాఠి వచ్చి ఉండాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పా. ఇందులో వివాదాస్పదం ఏముంది’ అని పేర్కొన్నారు. అయితే స్థానిక భాషను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ అనుబంధంగా ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మరాఠీ భాషను తప్పనిసరిగా బోధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని నెలలుగా మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడానికి నిరాకరిస్తున్న వ్యక్తులపై భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి.