calender_icon.png 22 October, 2024 | 3:58 PM

‘మహా’సంగ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్సే కీలకం

20-10-2024 12:00:00 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన భార తీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌మీద తాము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంబికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్‌కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బీజేపీ అగ్రనేతలకు అంటించిన చురకలు వారిని ఆకాశం నుండి నేలకు దించాయి. దీంతో హిందీ బెల్ట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని గుర్తించి, ఆర్‌ఎస్‌ఎస్ సహాయ సహకారాలు తీసుకొని గట్టెక్కిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర  ఎన్నికల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకత్వంలోనే ఎన్నికలకు సిద్ధమవుతోంది.

ఇటీవల జరిగిన హర్యానా, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ క్రియాశీలకపాత్ర పోషించడంతో మహారాష్ట్ర ఎన్నిక ల సందర్భంగా ఇప్పుడు సంఘ్  పరివార్ పతాక శీర్షికలో నిలిచింది. హర్యానాలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరిగినా ఆ పార్టీ గెలుపు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ ఉందనేది కాదనలేని సత్యం. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయిలో ప్రచారక్‌లతో సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వమని సూచించడంతో బీజేపీ దాదాపు సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపకుండా వారిపై ఉన్న వ్యతిరేకత నుండి గట్టెక్కింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ప్రత్యేకించి జమ్మూ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం చూపించింది. సరిగ్గా ఎన్నికలకు నెల ముందు ఆర్‌ఎస్‌ఎస్‌నుండి తీసుకొచ్చి రాంమాధవ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడంతో బీజేపీ గతం కంటే అధిక స్థానాలు సాధించింది.ఆ పార్టీ గెలిచిన 29 స్థానాలు జమ్మూ నుండి వచ్చినవే. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ లేకుండా ఆశించిన విజయాలు సాధించలేమని గుర్తించిన బీజేపీ ఇప్పుడు ‘మహా’ సంగ్రామంలో కూడా సంఘ్‌కు పెద్దపీట వేస్తున్నట్టు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ బృందం దృష్టికొచ్చింది.

టికెట్ల కేటాయింపులోనూ కీలకపాత్ర

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ’ కూటముల మధ్య పోటాపోటీగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని సంఘ్ పరివార్ కీలక పాత్ర పోషించనుంది. ఆర్థిక రాజధాని ముంబయి కేంద్రకమైన మహారాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్ అన్నింటిలో తానై బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. మహాయుతి కూటమిలో బీజేపీ తీసుకోవాల్సిన టికె ట్లు, భాగస్వాములైన శివసేన (ఏకనాథ్ షిం డే), ఎన్సీపీ (అజిత్ పవార్)లకు ఇవ్వాల్సిన సీట్లపై కూడా ఆర్‌ఎస్‌ఎస్ సూచనల మేరకే బీజేపీ అడుగులేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్ నాగపూర్‌లోనే ఉండడంతో  సంఘ్ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొంది. 

విదర్భ రీజియన్‌పై ప్రత్యేక దృష్టి

మరోవైపు నాగపూర్ కేంద్రకమైన విదర్భ రీజియన్‌లో అధికంగా 67 స్థానాలుండడం,బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండడంతో సంఘ్ పరివార్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరాఠ్వాడా, పశ్చి మ, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో పార్టీ బలహీనంగాఉందని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్ ఇక్కడ ప్రత్యేకంగా సంఘ్ కార్య కర్తల ను మోహరించింది. ముస్లింలు, మరాఠా, దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో వారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో వ్యూహరచనలో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీకి కీలక సూచనలు చేస్తూ అందుకు అనుగుణంగా పార్టీని నడిపిస్తోంది. మహాయుతి కూటమిలో అజిత్ పవార్ వర్గంపై ఆర్‌ఎస్‌ఎస్ అసంతృప్తిగా ఉండడంతో గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతోనే బీజేపీ నష్ట పోయిందని సంఘ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానించాయి. ఒకనొక దశలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ (అజిత్ పవార్)తో పొత్తు పెట్టుకోవద్దని సంఘ్ బీజేపీకి సూచించినా ఎన్నికల వేళ తప్పుడు సమాచారం వెళ్తుందనే భావనతో వెనకడుగు వేసింది. అయితే అవినీతి ఆరోపణలు ఉన్న అజిత్ పవార్ వర్గాన్ని వీలైనంతగా తక్కువ స్థానాలకే పరిమితం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ సూచనలతో మహాయుతి కూటమి టికెట్ల కేటాయింపులో కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివనసేనలో ఆర్‌ఎస్‌ఎస్ సానుభూతిపరులకు అధిక ప్రాధాన్యత ఉండేలా సంఘ్ పరివార్ వ్యవహరిస్తోంది. బీజేపీలోనే కాకుండా కూటమిలోని ఎన్సీపీ, శివసేన అభ్యర్థుల ఎంపికలోనూ ఆర్‌ఎస్‌ఎస్ చక్రం తిప్పుతుండడంతో మూడు పార్టీల్లోని టికెట్ ఆశావహులు సంఘ్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో టికెట్ల కేటాయింపులో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో కూటమిలో అసంతృప్తి మొదలుకావడంతో ఈ పరిణామాలు నష్టం చేకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

గడ్కరీకి పెద్దపీట!

టికెట్ల కేటాయింపులోనే కాకుండా బీజేపీకి అనుకూల ప్రచార శైలిలో ఆర్‌ఎస్‌ఎస్ పోషిస్తున్న పాత్ర చాపకింద నీరులా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ బాధ్యతలు చూసిన డిప్యూటీ సీం ఫడ్నవీస్ స్థానంలో ఇప్పుడు  కేంద్ర మంత్రి, సీనియర్ నేత నితిన్ గడ్కరీకి ప్రాధాన్యత ఇచ్చేలా ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీకి సూచనలు చేసింది. దీంతో  గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో గడ్కరీ సూచనలను పార్టీ గౌరవిస్తోంది. గడ్కరీయే కాకుండా రావుసాహెబ్ దాన్వే, పంకజ్ ముండే, సుధీర్ ముంగన్ తివారీతోపాటు మరో 21 మంది సీనియర్ నేతలకు బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించడంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఉంది. బీజేపీ భారీ ర్యాలీలు, సభలు,బాజా భజంత్రీలతో హడావుడి చేస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్ శాఖల్లోని సంచాలక్‌లు, ప్రముఖ్‌లు, ప్రచారక్‌లు, కార్యకర్తలు బూత్‌స్థాయిల్లో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ కోసం ప్రచారం చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ తమ ప్రతి శాఖ పరిధిలో 500 మందికిపైగా ఓటర్లను కలుసు కొని వారి కుటుంబ సభ్యులతో కూడా చర్చిస్తోంది. సెగ్మెంట్‌లో మెరుగైన అభ్యర్థి ఎంపికతో పాటు స్థానిక సమస్యలపై కూడా దృష్టి పెట్టి వాటికనుగుణంగా ప్రచార శైలిని కూడా ఆర్‌ఎస్‌ఎస్ మూడో కంటికి తెలియకుండా నిర్వహిస్తోంది.

హర్యానా తరహా వ్యూహం

మరాఠా, దళితులు, ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆయా సామాజిక వర్గాల ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రత్యే క కార్యక్రమాలు చేపడుతోంది. హర్యానాలో జాట్లేతరుల ఓట్లతో లబ్ధి పొంది నట్టు మహారాష్ట్రలో మరాఠాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మరాఠేతరులపై దృష్టి పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్ అందుకు అనుగుణంగా టికెట్ల కేటాయింపులో, ప్రచారంలో బీజేపీకి సూచనలు ఇస్తోంది. రాష్ట్రంలో 17 శాతంపైగా ఉన్న దళితుల్లో సగంపైన ఉండే బౌద్ధ సామాజికవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ‘వనవాసి కల్యాణ్ ఆశ్రం’ కార్యక్రమాలతో  ఇప్పటికే ఆ వర్గాలకు చేరువైన ఆర్‌ఎస్‌ఎస్ ఇటీవల బౌద్ధ సన్యాసులను సన్మానించడం వంటి కార్యక్రమా లను చేపట్టింది. ఈ సామాజికవర్గానికి చేరువయ్యేందుకు బీజేపీ ఇప్పటికే 400కు పైగా చిన్నచిన్న సమావేశాలను నిర్వహించడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉంది. 12 శాతానికిపైగా ముస్లిం ఓట్లతో బీజేపీకి ఇబ్బందులు తప్పవని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్ ఇటీవల బీజేపీ అధిష్టానంతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ఓటు వేయడంతో 14 స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్ గణాంకాలతో కూడిన ‘ఓట్ జిహాద్’ పేరుతో ఒక నివేదిక తయారు చేసి, ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పార్టీకి సూచించింది. ‘ఓట్ జిహాద్’ను ఎన్నికల ప్రచార అంశంగా చేసుకొని సంబంధిత సెగ్మెంట్లలో దీనికి వ్యతిరేకంగా హిందూ ఓట్లను గంపగుత్తగా పొందాలని ప్రణాళికలు రూపొందిస్తూ సంఫ్‌ు పరివార్ ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తోంది.

2024 లోక్ సభ ఎన్నికల వేళ  బీజేపీతోఅంటీముట్టనట్లుగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ మహారాష్ట్ర మహా సంగ్రామంలో’ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులతో, ప్రత్యేక వ్యూహాలతో పోటాపోటీగా బరిలో ఉన్న ఈ రెండు పార్టీలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఆర్‌ఎస్‌ఎస్. కాంగ్రెస్ తనంతట తానే ప్రచారం నిర్వహిస్తుంటే బీజేపీ కోసం ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రతి ఓటరును కలుస్తుండడం ఆ పార్టీకి బలమైన అస్త్రం. ఈ పరిణామాల మధ్య రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినా మహా సంగ్రా మంలో’ పరోక్షంగా సంఘ్ నిర్వహించే పాత్ర కీలకం కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 వ్యాస రచయిత పొలిటికల్ ఎనలిస్ట్,

 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

-ఐ.వి.మురళీకృష్ణ శర్మ