* స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కించపరిచారు
* ముమ్మాటికీ అది దేశద్రోహమే
* ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ, జనవరి 15: రామమందిరం ప్రతిష్ఠాపన తర్వాతే దేశానికి నిజమైన స్వా తంత్య్రం వచ్చిందంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, రాజ్యాంగ సిద్ధాంతం మధ్య యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజునే వచ్చిందనీ 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదంటూ మాట్లాడి మోహన్ భగవత్ దేశ ప్రజలతోపాటు రాజ్యాంగాన్ని అవమానించారన్నారు.
బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన యోధుల త్యాగాలను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కించపరిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. వేరే ఏదైనా దేశంలో అయితే ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి ఉండేవారన్నారు. బీజేపీ, ఆరెఎస్‌ఎస్ దేశంలోని ప్రతి సంస్థనూ తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని రాహుల్ ఆరోపించారు. తాము ఇప్పు డు బీజేపీ, ఆరెఎస్‌ఎస్‌తోపాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఎన్‌ఎస్‌యూఐ నిరసనలకు దిగింది. భగవత్ ఇంటిని ముట్టడించింది.