28-01-2025 01:32:55 AM
మరోసారి భారీ నష్టాల్లో సూచీలు.. 23 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బలహీన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచా యి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 23 వేల పాయింట్ల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టా ల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 3 శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ 4 శాతం చొప్పున కుంగాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరై.. రూ.410 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 75,700.43 పా యిం ట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అదే నష్టా ల పరంపర రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 75,267.59 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ.. చివరికి 824.29 పాయింట్ల నష్టంతో 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 263.05 పాయింట్లు కోల్పోయి 22,829.15 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 86.33 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్, జొమాటో, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియగా.. ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.
కారణాలు ఇవే..
అమెరికాలోని అక్రమ వలసదారులకు తిప్పి పంపే విషయంలోఅధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏ దేశంపై ఉరుముతారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ సారి ఎలాంటి కోతా ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే విషయంలో ఫెడ్ నుంచి ఎలాంటి కామెంట్లు వెలువడతాయనే దానిపై మార్కెట్లు చలించే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు.
త్రైమాసిక ఫలితాల సీజన్‌లో వెలువడుతున్న కార్పొరేట్ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో మదుపర్లు నిరాశగా ఉన్నారు. దీనికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కూడా మదుపర్లకు పెద్దగా ఆశల్లేకపోవడం మార్కెట్లలో నిరాసక్తతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో వైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్ నాటికి (జనవరి 24) సుమారు రూ.64 వేల కోట్ల ఈక్విటీలను వారు విక్రయించడం గమనార్హం. సమీప భవిష్యత్లో ఈ మొత్తాలు తగ్గుతాయని గానీ, మళ్లీ కొనుగోళ్లకు దిగుతారన్న అంచనాలు గానీ లేకపోవడం మార్కెట్లో ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫిబ్రవరిలో మహాపతనం? గుబులు పుట్టిస్తున్న జోస్యం
ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘ రిచ్ డాడ్, పూర్ డాడ్’ పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి స్టాక్‌మార్కెట్లకు సంబంధించి సంచలన జోస్యం వెలువరించారు.‘ చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్’ వచ్చే ఫిబ్రవరిలో సంభవించనుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ‘ ఎక్స్’లో పోస్టు చేశారు.
రాబోయే మహాపతనం సంప్రదాయ పెట్టుబడుల మార్కెట్‌ను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తం అయ్యే వారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్‌డాడ్ పుస్తకంలో కూడా ఆయన రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు.
గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపేనని కూడా ఆయన అందులో చెప్పారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకే లభిస్తాయని ఆయన అంటున్నారు. బిట్‌కాయిన్, బంగారం, వెండిలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని చాలాకాలంగా కియోసాకి తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.