calender_icon.png 12 February, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ షాక్‌తో రూ.6 లక్షలు కోట్లు ఆవిరి

11-02-2025 12:42:54 AM

నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు 

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం  భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల తో వరుసగా నాలుగోరోజూ మార్కెట్లు నష్టపోయాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతుల పై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య లు సెంటిమెంట్‌ను  దెబ్బతీశాయి.

ఈ క్రమం లో సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,400 దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువలో దాదాపు రూ.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.418 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 77,789.30 (క్రితం ముగింపు 77,860.19) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది.

రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 77,106.89 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ ఒక పైసా మేర బలపడి 87.49 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, జొమాటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకం విధించబోతు న్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఏ దేశాలపై? ఎప్పటి నుంచి? అనే వివరాలు పంచుకో నప్పటికీ దాని ప్రభావం మార్కెట్లపై పడింది. అంతేకాదు తమపై సుంకాలు విధించే వారిపై సుంకాలు తప్పవంటూ ఆయన చేసిన వ్యాఖ్య లు కూడా నష్టాలకు కారణమయ్యాయి.