- రామప్పకు రూ.74కోట్లు, సోమశిలకు రూ.68కోట్లు ప్రకటించిన కేంద్రం
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి షెకావత్‌కు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): పర్యాటక రంగం అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం కింద పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపగా.. అందులో మన రాష్ట్రం నుంచి రామప్ప, సోమశిల ఎంపికైనట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణలోని ప్రాంతాలను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు కిషన్‌రెడ్డి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. రూ.3,295,76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు 50 ఏళ్ల వ్యవధిలో వడ్డీ రహిత రుణాలు అందించనున్నట్లు చెప్పారు. రూ.74 కోట్లతో రామప్ప, రూ.68కోట్లతో సోమశిలకు మొత్తం రూ.142 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
గతంలోనూ తెలంగాణకు సంబంధించి చారిత్రక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మోదీ నిధులు ఇచ్చారన్నారు. అందులో ప్రసాద్ పథకం కింద రూ.62కోట్లతో రామప్ప ఆలయం అభివృద్ధి పనులు.. స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ.80కోట్లతో ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బోగత వాటర్ ఫాల్స్‌ను కలపుతూ గిరిజన సర్క్యూట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రసాద్ పథకం కింద రూ. 42 కోట్లతో భద్రాచలం ఆలయం, రూ.37కోట్లతో అలంపూర్ జోగుళాంబ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి రూ.4.5 కోట్లు విడుదల చేసి పనులు చేపడుతోందన్నారు. స్వదేశ్ దర్శన్‌లో భాగంగానే రూ.57కోట్లతో భువనగిరి కోట, రూ.36కోట్లతో అనంతగిరి ఎకో టూరిజం, సీబీడీడీ పథకం కింద రూ.25 కోట్లతో నల్లగొండ కల్చర్ హెరిటేజ్ ప్రాజెక్టు, రూ.10 కోట్లతో కామారెడ్డి ఎకో టూరిజం ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరు చేసినట్లు కిషన్‌రెడ్డి వివరించారు.