02-04-2025 12:00:00 AM
మంత్రి పొంగులేటి చొరవతో సుడా నుంచి నిధులు మంజూరు
ఖమ్మం, ఏప్రిల్ 1 ( విజయక్రాంతి ):- తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమా చార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో పాలేరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి సుడా నుంచి రూ.90.50లక్షల విడుదల అయ్యాయి. ఈ విషయాన్ని సంబంధిత మున్సిపల్ అధికారులు ధృవీకరించారు.
ప్రధానంగా వేసవి అధికంగా ఉండటంతో దానిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు సమస్య తల్తెతకుండా వాటి పరిష్కారం కోసం రూ.50లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన డివిజన్ల సుందరీకరణలో భాగంగా డివైడర్ల మధ్య మొక్కల ఏర్పాటుకు రూ.15. 50లక్షలు, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని శానిటేషన్, ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటుకు రూ. 25లక్షల కేటాయింపు జరిగింది.
ఇతర మున్సిపాలిటీలకు ధీటూగా ఏదులాపురం మున్సిపాలి టీని తీర్చిదిద్దేందుకు మంత్రి పొంగులేటి విశేష కృషి చేస్తున్నారని క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. నిధుల విడుదల పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని ఆయన పేర్కొన్నారు.