calender_icon.png 15 November, 2024 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 6 లక్షల కోట్లు ఆవిరి!

05-11-2024 12:00:00 AM

  1. 942 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  2. 24 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ
  3. భారీగా నష్టపోయిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుమరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా ఎన్నికలు, వడ్డీ రేట్లపై త్వరలో ఫెడ్ తన నిర్ణయాలను ప్రకటించనుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్ల మేర నష్టపోగా.. ఆ తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 24 వేల మార్కును కోల్పోయింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.448 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

సెన్సెక్స్ ఉదయం 79,713.14 (క్రితం ముగింపు 79,724.12)  వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకుంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 78,232.60 వద్ద కనిష్ట్ఠాన్ని తాకింది. చివరికి 941.88 పాయింట్ల నష్టంతో 78,782.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో 23,995.35 వద్ద స్థిరపడింది.

డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 84.11 స్థాయికి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.

అదానీ పోరట్స్, రిలయన్స్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2753 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

అమెరికా ఎన్నికల ప్రభావం

* అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ఇది ప్రభావం చూపించే అంశంగా నిలిచింది. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు ఈ నెల 7న వెలువడనుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

* ఇజ్రాయెల్ -ఇరాన్‌ల మధ్య ఘర్షణలు పెరుగుతుండటంతో పీపా చమురు ధర సోమవారం రెండు శాతం వరకు పెరిగి 75 డాలర్లకు చేరింది. ఒపెక్+ దేశాలు ఉత్పత్తి పెంచే విషయమై పెదవి విరుస్తున్నాయి.

* మన రూపాయి విలువ భారీగా పతనమైన జీవనకాల కనిష్ఠానికి రూ.84.11 చేరింది. దీంతో భారత విదేశీ కరెన్సీ నిల్వలపై దీని ప్రభావం పడనుంది. చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనం వెరసి ఆర్‌బీఐ వద్ద ఉన్న డాలర్ల నిల్వలను తగ్గించే అవకాశం ఉంది.

* రెండో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా మార్కెట్ సూచీల పతనానికి కారణంగా నిలిచింది.

* విదేశీ పోర్టుఫోలియో మదుపరులు భారీగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండటం సూచీలు పడిపోవడానికి మరో కారణంగా నిలిచింది. ఒక్క అక్టోబర్ నెలలోనే వీరు రూ.1,13,858 కోట్లను ఉపసంహరించుకొన్నారు.