calender_icon.png 23 October, 2024 | 10:53 AM

రూ.100 కోట్ల భూదాన్ భూమికి ఎసరు

09-08-2024 12:32:25 AM

  1. వెలుగులోకి ఎమ్మార్వో శైలజ మరో నిర్వాకం
  2. నిషేధిత జాబితాలో ఉన్న 5.04 ఎకరాల భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చే కుట్ర
  3. భూదాన్ యజ్ఞబోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కలెక్టర్‌కు సిఫారసు చేసిన వైనం
  4. ఎమ్మార్వో తీరుపై అనుమానంతో హోల్డ్‌లో పెట్టిన కలెక్టర్ 
  5. అంతర్గత విచారణలో భూదాన్ భూమిగా తేలడంతో నివ్వెరపోయిన కలెక్టర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (విజయక్రాంతి): ‘నవ్వి పోదురు గాక నాకేటి సిగు’్గ అన్న చందంగా మారింది రాష్ట్రంలో కొందరు రెవెన్యూ అధికారుల తీరు. ఓ వైపు ఏసీబీ రైడ్స్ జరుగు తున్నా రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి అధికారుల కారణంగా ఇప్పటికే అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ప్రైవే టు వ్యక్తుల పాలు కాగా, తాజాగా నగర శివారులో రూ.100 కోట్ల విలువైన భూదాన్ భూమికి ఎసరు వచ్చింది.

భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఆ ఎమ్మార్వో ఏకంగా ఆర్డీవోను బురిడీ కొట్టించి జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్‌వోసీ తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ కలెక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తహసీల్దార్ సిఫారసు లను హోల్డ్ చేయడంతో విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు చేరకుం డా ఆగిం ది. వంద కోట్ల విలువైన భూదాన్ భూమిని ధారాదత్తం చేసేందుకు మేడ్చల్ ఎమ్మార్వో శైలజ చేసిన కుట్రలపై మేడ్చల్ రెవెన్యూ అధికారులలో జోరుగా చర్చ జరుగుతోంది. 

ముమ్మాటికీ భూదాన్ భూమినే..

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 185, 187, 193, 199, 196, 183, 194, 192,195, 201 సర్వే నంబర్లలో నర్సింగ్ రావు అనే వ్యక్తికి 54.25 ఎకరాల భూమి ఉన్నది. నర్సింగ్ రావు భూదానోద్యమ పితామహుడు వినోభాబావే పిలుపుతో వెదిరె రామచంద్రా రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని సర్వే నంబర్ 185లో ఉన్న 5.04 ఎకరాల భూమిని, 187లోని 4.07 ఎకరాలను, 193లోని 3.36 ఎకరాలను, 199లోని 3.21 ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేశాడు. ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డుకు ఇచ్చినట్లుగా నాటి తహసీల్దార్ ఆమోదంతో పాటు రెవెన్యూ, భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డులలో స్పష్టంగా నమోదైంది. ఇది ప్రస్తుతం ధరణి రికార్డుల్లోనూ  రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో చేర్చారు.  

38 ఉందంటూ హైకోర్టుకు..

ఎల్లంపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 185లో 5 ఎకరాలు, 186లో 1.20 ఎకరాల (మొత్తం 6.20 ఎకరాలు) భూమి ఉందని పేర్కొనడంతో పాటు తన తండ్రికి ఈ భూమిపై పీటీ (ప్రొటెక్టెడ్ టెనెన్సీ) యాక్ట్ ప్రకారం 38 సర్టిఫికెట్ ఉందని ఓ వ్యక్తి రెవెన్యూ కోర్టులను ఆశ్రయించాడు. కానీ, సీసీఎల్‌ఏ నుంచి అతని అభ్యర్థనలు తిరస్కరణకు గురి కావడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ తర్వాత చట్ట ప్రకారం పిటిషన్‌దారుడి వాదనలు వినడంతోపాటు ప్రత్యేకమైన కారణాలు ఉంటే చట్టానికి లోబడి నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచిస్తూ 2022 నవంబర్ 25వ తేదీన తీర్పును వెల్లడించింది. 

చాకచక్యంగా వ్యవహరించిన కలెక్టర్..

ఎమ్మార్వో తీరుపై ఇప్పటికే అనుమానంతో ఉన్న మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పోట్రు 5.04 ఎకరాల భూదాన్ భూమిని నిషేధిత జాబితాలో తొలగించాలంటూ ఎమ్మార్వో శైలజ సిఫారసు చేసిన ఫైల్‌ను హోల్డ్‌లో పెట్టారు. అంతేకాదు ఈ భూమిపై అంతర్గత విచారణ చేయించిన కలెక్టర్ ఇది భూదాన్ భూమిగా నిర్ధారించుకొని ఎమ్మార్వో తీరుపై నివ్వెరపోయినట్లు మేడ్చల్ జిల్లా రెవెన్యూ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే కలెక్టర్ ఈ భూమిని కాపాడాతారా లేదా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా ?

వేచి చూడాల్సిందే. అయితే కొద్ది రోజుల కిందట మేడ్చల్ మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ముగ్గురు వారసుల భూమిని ఇద్దరికే రాసిచ్చి ఒంటరి మహిళకు, ఆమె బిడ్డకు అన్యాయం చేసి వార్తల్లో నిలిచిన ఎమ్మార్వో శైలజ.. తాజాగా రూ.100 కోట్ల భూదాన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు చేసిన కుట్రలపై సమగ్ర విచారణ చేయాలని ప్రజలు మేడ్చల్ కలెక్టర్‌తో పాటు సీసీఎల్‌ఏ కమిషనర్‌ను, ప్రభు త్వాన్ని కోరుతున్నారు.  ఈ వ్యవహారంలో వివరణ కోసం ఎమ్మార్వో శైలజను ఫోన్‌లో సంప్రదించగా ఆమె స్పందించలేదు.

రంగంలోకి ఎమ్మార్వో శైలజ..

రాష్ట్రంలో అమలులో ఉన్న ఆర్‌ఓఆర్ యాక్ట్  2020 ప్రకారం తహసీల్దార్ కోర్టులు రద్దు కావడంతో 2022 నవంబర్ 25న వచ్చిన ఈ ఆర్డర్‌పై గతంలో మేడ్చల్ తహసీల్దార్లుగా పనిచేసిన వారు ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు. అలాగే రెవెన్యూ రికార్డులలో సర్వే నంబర్ 185లో 5.04 ఎకరాల భూమి భూదాన్ భూమిగా నమో దై ఉండడంతో తహసీల్దార్లు ఆ భూమి జోలికి వెళ్లలేదు. కానీ ఎన్నికల సమయంలో మేడ్చల్ తహసీల్దార్‌గా బాధ్యత లు స్వీకరించిన శైలజ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసే బాధ్యతను తీసుకున్నారు. 2022 నవంబర్ 25న జారీ అయిన కోర్టు ఆర్డర్ ప్రకారం 5.04 ఎకరాల భూదాన్ భూమిని ధరణి నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని కోరుతూ కీసర ఆర్డీవో రికమెండేషన్‌తో ఏకంగా కలెక్టర్‌కు సిఫారసు చేశారు.

వాస్తవానికి ఇలాంటి ఆర్డర్లపై నిర్ణయం తీసు కోవడానికి ముందు తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఉన్న భూ దాన్ యజ్ఞ బోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుం ది. కానీ మేడ్చల్ ఎమ్మార్వో శైలజ ప్రభు త్వం నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ తీసుకోకుండానే, కనీసం భూదాన్ యజ్ఞ బోర్డు అథారిటీ రికార్డులను పరిశీలించకుండానే నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆం తర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. కానీ ఏకపక్షంగా రూ.100 కోట్ల విలువైన 5.04 ఎకరాల భూదాన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.