అమెరికాలో మాంద్యం భయాలతో కరిగిన ఇన్వెస్టర్ల సంపద
- రికార్డుల ర్యాలీకి బ్రేక్
- సెన్సెక్స్ 885 పాయింట్లు పతనం
- నిఫ్టీ 293 పాయింట్లు డౌన్
ముంబై, ఆగస్టు 2: ఐదు రోజులపాటు వరుస రికార్డులతో అదరగొట్టిన మార్కెట్ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో శుక్రవారం హఠాత్ పతనాన్ని చవిచూసింది. అటు యూఎస్ నుంచి ఇటు జపాన్ వరకూ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ సూచీలు కుప్పకూలడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ భారీ గ్యాప్‌డౌన్ తో ట్రేడింగ్ ఆరంభమయ్యింది. ఇంట్రాడేలో 998 పాయింట్ల మేర పతనమై 80,869 పాయింట్ల కనిష్ఠస్థాయిని చూసింది. చివరకు 885 పాయింట్ల నష్టంతో 80,982 పాయిం ట్ల వద్ద నిలిచింది.
ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 24,800 పాయింట్ల స్థాయిని వదులుకుని 24,687 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. చివరకు 293 పాయింట్ల నష్టంతో 24,717 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ ఒక్క రోజులోనే రూ.4.46 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,46,003 కోట్లు తగ్గి రూ. 4,57,16,946 కోట్లకు (5.46 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. మెటల్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
మారుతి సుజుకి టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మారుతి సుజుకి 4.63 శాతం క్షీణించి రూ. 12,730 వద్ద నిలిచింది. ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ టాటా మోటార్స్ షేరు 4.17 శాతం పడిపోయింది. జూలైలో పాసింజర్ వాహన విక్రయాలు తగ్గాయన్న వార్తలతో ఈ రెండు కంపెనీల షేర్లు అధిక క్షీణతను చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్‌లు 2 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మాస్యూటికల్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు 1.8శాతం వరకూ పెరిగాయి.
వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా రియల్టీ ఇండెక్స్ 3.56 శాతం పడిపోయింది. మెటల్ ఇండెక్స్ 3 శాతం క్షీణించగా, ఆటోమొబైల్ ఇండెక్స్ 2.97 శాతం తగ్గింది. ఐటీ ఇండెక్స్ 2.05 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.83 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.79 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.70 శాతం చొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్ ఇండక్స్ మాత్రం స్వల్ప లాభంతో ముగిసింది. చిన్న షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.19 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం చొప్పున క్షీణించాయి.
ఖరీదైన షేర్ల విలువలు
ఇటీవల జరిగిన పెద్ద ర్యాలీ కారణంగా షేర్ల విలువలు ఖరీదుకావడం కూడా తాజా పతనానికి దారితీసినట్టు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. అయితే ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నందున తాజా డౌన్‌ట్రెండ్ పరిమితంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ వెలువడిన క్యూ1 ఫలితాలు నిస్తేజంగా ఉన్నాయని, అధిక శాతం షేర్ల విలువలు అత్యంత గరిష్ఠస్థాయిలో ఉన్నందున లాభాల స్వీకరణ జరిగినట్టు నాయర్ వివరించారు.
గ్లోబల్ సెగ
దేశీయ మార్కెట్‌కు గ్లోబల్ ఈక్విటీల సెగ తగిలిందని విశ్లేషకులు చెప్పారు. యూఎస్‌లో జాబ్‌లెస్ క్లెయింలు అంచనాల్ని మించి పెరిగినట్టు, నిరుద్యోగం రేటు 4.3 శాతానికి చేరినట్టు వెలువడిన గణాంకాలతో ఆ దేశం ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనమైనట్టు విశ్లేషకులు వివరించారు. అమెరికా ఐఎస్‌ఎం మాన్యుఫా క్చరింగ్ ఇండెక్స్ 46.6 వద్దకు పడిపోవడంతో తిరిగి మాంద్యం భయాలు తలె త్తాయని అన్నారు.
యూఎస్ ఐటీ రంగం ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, నిరుద్యోగం పెరగడం, బ్యాంక్ ఆఫ్ జపాన్ మరో దఫా వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు, చైనా వృద్ధిరేటు నెమ్మదించడం తదితర అంశాలు మార్కెట్ సెంటి మెంట్‌ను బలహీనపర్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. జపాన్ నికాయ్ ఇండెక్స్ 5 శాతం పతనంకాగా, కొరియా కోస్పి ఇండెక్స్ 3 శాతం, హాంకా ంగ్, షాంఘైలు 1 శాతంపైగా తగ్గాయి. గురువారం రాత్రి 2 శాతంవరకూ పడిపోయిన యూఎస్ స్టాక్ సూచీలు శుక్రవా రం కూడా భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. యూరప్‌లోని ప్రధాన మార్కె ట్లయిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 1 శాతంపైగా పడిపోయాయి.