calender_icon.png 16 March, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 4 కోట్ల పార్కు స్థలం కబ్జా!

15-03-2025 12:00:00 AM

  1. భారీగా మట్టి పోసి.. రాళ్లు వేసిన అక్రమార్కులు 
  2. అత్తాపూర్ డివిజన్ పరిధి సిరిమల్లె నగర్ లేఔట్ లో పార్కుమాయం!
  3.  చాలాకాలం క్రితమే గోడలు ధ్వంసం  
  4.  జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించాలంటున్న స్థానికులు 

రాజేంద్రనగర్, మార్చి 14 (విజయక్రాంతి): సుమారు రూ. 4 కోట్ల రూపా యలు విలువచేసే పార్కు స్థలాన్ని అక్రమార్కులు దర్జాగా కబ్జా చేశారు. పార్కు స్థలంలో భారీగా మట్టి పోసి రాళ్లు వేశారు. అదేవిధంగా చాలా రోజుల క్రితమే పార్కుకు సంబంధించిన గోడలను ధ్వంసం చేశారు.

కోట్ల రూపాయలు విలువచేసే సుమారు 300 గజాలకు పైగా ఉన్న స్థలాన్ని అక్రమార్కులు స్వాహా చేసేందుకు చక చకా పావులు కదుపుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ పరిధిలోని సిరిమల్లె నగర్ లే ఔట్ లో అక్రమార్కులు కబ్జా పర్వానికి తెర లేపారు.

నలంద నగర్ నుంచి వచ్చే ప్రధాన రహదారికి రెండో బిట్టు ఆయన పార్కు స్థలాన్ని అక్రమార్కులు మింగేస్తున్నారు. ఇక్కడ గజం జాగా సుమారు లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 

 అభివృద్ధికి దూరంగా..

 రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు పార్కుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కుల పని సులభ మైంది. వాటిని కబ్జా చేసి కోట్ల రూపాయలు గడించేందుకు కుట్రలకు తెరరేపారు. ఇందు లో భాగంగానే సిరిమల్లె నగర్ లేఔట్ లో ప్రధాన రహదారి అపోలో మెడికల్ షాపు వెనుక వైపు ఉన్న సుమారు 300 గజాలకు పైగా ఉన్న పార్కును క్రమంగా కబ్జా చేస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 100 ట్రాక్టర్లకు పైగా మట్టి పోశారు. అదేవిధంగా అందులో గ్రానైట్ రాళ్లు ఇనుప రాడ్లు వేశారు. దీంతోపాటు అక్రమార్కులు పార్కు సంబంధించిన గోడలను ఆనవాళ్లు లేకుండా చేశారు. 

 క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు  

 పార్కు స్థలం కబ్జా అవుతుందనే విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే మా సిబ్బందిని పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్కు స్థలాన్ని కాపాడుతాం. పార్కులను కచ్చితంగా పరిరక్షిస్తాం. ఎవరైనా కబ్జా చేస్తే కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తాం.రవికుమార్, రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్