రెండేళ్లలో 45 వేల ఎకరాలకు సాగునీరు
హైదరాబాద్‌లో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు సమీక్ష
పెద్దపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గ పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పను లు ఇప్పటిదాకా 75 శాతం పూర్తయ్యాయి. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో ప్రభుత్వం ఈ ఎత్తపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలసిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది.
శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటి పారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకం పనులకు రూ.571.57 కోట్ల పరిపాలన అనుమతి లభించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
మొత్తం 45 వేల ఎకరాలకు సాగునీరు, అరు టీఎంసీల నీటిని మంచి నీటి సరఫరా కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని తరలించి కన్నెపల్లి వద్ద ఒకటో పంప్ హౌజ్ ద్వారా 4.2 టిఎంసీల నీరు దిగువన రెండో పంప్ హౌజ్ కు నీరు సరఫరా అవుతుందని, మొదటి పంపు హౌజ్ సెకనుకు 600 క్యూబిక్ ఫీట్ల నీటిని ఎత్తిపోస్తుందని, అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు నీటి సరఫరా అవుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
మిగిలిన నీరు రెండో పంపు హౌజ్‌కు చేరుతుందని, కాటారంలో ఏర్పాటు చేసే రెండో పంపు హౌజ్ ద్వారా గారెపల్లి, పోలారం, తాండ్ర, యెల్లాపూర్, కొత్తపల్లి, రుద్రారం, ధన్వాడ, ఆదివారం పేట, గుమ్మలపల్లి, వీరాపూర్, గూడూర్ చెరువులకు గోదావరి జలాలు చేరుతాయన్నారు. రానున్న రెండేళ్లలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి చెరువుల ద్వారా సాగునీరు అందించాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
శ్రీరాంసాగర్‌తో 28 వేల ఎకరాల ఆయకట్టు
ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ జలాలతో 28,800 ఎకరాలకు సాగునీరు అం దుతోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. డీ -83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు చేరుకుని, అక్కడి నుంచి 24 మైనర్ కాల్వల ద్వారా మొత్తం 28.800 ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. కాలక్రమేణా కాలువల్లో పూడిక చేర డం వల్ల నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు. గుండారం చెరువు నుంచి మైనర్ల చివరి వరకు మరమ్మతులు జరిపి నీటి సామర్థ్యాన్ని పెంచాలని శ్రీరాంసాగర్ ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు.