- మార్కెట్ ర్యాలీతో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 110 పాయింట్లు అప్
- ముంబై, డిసెంబర్ 5: ప్రపంచ సానుకూల సంకేతాల ప్రభావంతో వరుసగా ఐదో రోజూ మార్కెట్ ర్యాలీ కొనసాగింది. ఈ నాన్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ. 15.18 లక్షల కోట్లు పెరిగింది. వరుస ఐదు రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,722 పాయింట్లు (3 శాతం) జంప్ చేయగా, బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.15,18,926 కోట్లు పెరిగి రూ.4,58,17,010 కోట్లకు (5.41 ట్రిలియన్ డాలర్లు) చేరింది.
- ఐదో రోజైన గురువారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,364 పాయింట్లు పెరిగి 82,317 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 809 పాయింట్లు లాభపడి 81.765 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తాజాగా 241 పాయింట్లు పెరిగి 24,708 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్ మార్కెట్లు కొత్త రికార్డుస్థాయికి ఎగిసినందున దేశీయంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో ఐదో రోజూ స్టాక్ సూచీలు ర్యాలీ చేశాయని విశ్లేషకులు తెలిపారు. యూఎస్‌లో డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ తొలిసారిగా 45,000 పాయింట్లను దాటడం ఈక్విటీ మార్కెట్ల పటిష్ఠతను సూచిస్తున్నదని, అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందడం, ద్రవ్యోల్బణం దిగిరావడం ఇందుకు కారణమని వారు వివరించారు.
గ్లోబల్ అప్‌ట్రెండ్‌లో పాలుపంచుకున్న భారత్
వరుస ఐదు రోజుల ర్యాలీతో గ్లోబల్ మార్కెట్ల అప్‌ట్రెండ్‌లో భారత్ సైతం పాలుపంచుకున్నదని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. యూఎస్ స్టాక్ సూచీలు డోజోన్స్, ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్‌ల రికార్డు గరిష్ఠస్థాయిల్ని అనుసరిస్తూ ఐటీ ఇండెక్స్ 1.96 శాతం జంప్‌చేసిందని, బ్యాంక్ నిఫ్టీ కూడా ర్యాలీజరిపిందని తాప్సే వివరించారు. విదేశీ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్‌కు మద్దతుగా నిలిచినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా తెలిపారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నదంటూ ఫెడ్ చైర్మన్ పొవెల్ చేసిన వ్యాఖ్యలు బుల్స్‌కు టానిక్‌లా పనిచేశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
నేటి ఆర్బీఐ పాలసీ ప్రకటన కీలకం
మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం శుక్రవారం ఉదయం 1౦ గంటలకు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్‌దాస్ వెల్లడించే నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌కు కీలకమని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థకు లిక్విడిటీ కల్పించే సీఆర్‌ఆర్ కోత ఉంటుందన్న అంచనాలు ఇప్పటికే బ్యాంకింక్ షేర్లలో డిస్కౌంట్ అయినందున, శుక్రవారం పాలసీ ప్రకటన వెలువడిన తర్వాత మార్కెట్ స్పందించేతీరు రానున్న రోజుల్లో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు.