* సమ్మతించిన వారికి పదిరోజుల్లో చెక్కులు
* మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
* ర్యాపిడో క్యాబ్ సర్వీసులతో మెట్రో భాగస్వామ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): పాతబస్తీ మెట్రో (ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట) కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా చేపడుతున్నభూసేకరణలో ప్రభావితమవుతున్న ఆస్తులకు గజానికి రూ.81వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రోభాగస్వామ్యంతో ‘ర్యాపిడో’ సంస్థ పదిమిలి యన్ల ప్రయాణికుల బుకింగ్స్ పూర్తున సందర్భంగా శనివారం బేగంపేటలోని మారీగోల్డ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని..ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 1100 ఆస్తులు ప్రభావిత మవుతున్నట్లు తెలిపారు.ఆస్తులు కోల్పోతున్న వారికి మరో వారం, పదిరోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని.. ఏమైనా అభ్యంతరా లుంటే తెలపాలన్నారు.
ఇప్పటికే కొంతమంది యజమానులు తమ అంగీకారపత్రాలను అందజేశారని చెప్పారు. ఈ కారిడార్‌లో త్వరలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. దశలవారీగా నగరంలో 250 మేర మెట్రోను విస్తరించబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఫేజ్ లో భాగంగా నిర్మించబోతున్న పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి 1100 ఆస్తులకు సంబంధిం చి దాదాపు 65వేల గజాల భూమిని సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ భూసేకరణకు దాదాపు రూ.800కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక నంబర్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఫస్ట్ మెయిల్, లాస్ట్ మెయిల్ కనెక్టివిటీలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ర్యాపిడో సంస్థతో ఎల్‌అండ్‌టీ మెట్రో భాగస్వామ్యం కుదుర్చుకుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రోకు అనుబంధంగా నడిచే ర్యాపిడో సేవలకు సంబంధించి మహిళా ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ నంబర్‌ను తీసుకువస్తామని ఆయన తెలిపారు. మహిళల భద్రత కోసం మహిళా పైలట్లను తీసుకురావాలని ర్యాపిడో సంస్థ ప్రతినిధులకు సూచించారు.
మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని వారిలో దాదాపు 2 లక్షల మంది ఫస్ట్ మెయిల్, లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ ద్వారా ర్యాపిడో, స్విద, ఆర్టీసీ, ఇతర సంస్థల ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారని అన్నారు. ర్యాపిడో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పవన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ఎల్‌అండ్‌టీ మెట్రో భాగస్వామ్యంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, తక్కువ ధరకే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ లిమిటెడ్ సీవోవో మురళీవరదరాజన్, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.