* మార్కెట్ పతనంతో ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
* సెన్సెక్స్ మరో 1,176 పాయింట్లు డౌన్
* 23,600 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై, డిసెంబర్ 20: అదేపనిగా ఐదు రోజుల నుంచి భారీ పతనాన్ని చవిచూస్తున్న భారత స్టాక్ మార్కెట్‌పై బేర్స్ ఆధిపత్యం సాధించారు. శుక్రవారం బేర్స్ దెబ్బకు బుల్స్ కకావికలమై ఈ షేరూ, ఆ షేరూ అనిచూడకుండా వదిలించుకుని పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. మార్కెట్ అమెరికా కేంద్ర బ్యాంక్ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై ప్రదర్శించిన కఠిన వైఖరి, రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, కార్పొరేట్ ఫలితాల పట్ల ఆశలు సన్నగిల్లడం తదితర అంశాలతో భారత స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ పతనాన్ని చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 1,176 పాయింట్లు కోల్పోయి 79,000 పాయింట్ల స్థాయిని సైతం వదులుకుని 78,041 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 364 పాయింట్లు కోల్పోయి 23,600 పాయింట్ల దిగువన 23,587 పాయింట్ల వద్ద నిలిచింది. వరుస ఐదు రోజుల్లో సెన్సెక్స్ 4,091 పాయింట్లు, నిఫ్టీ 1,180 పాయింట్ల చొప్పున భారీ నష్టాన్ని చవిచూశాయి. ఈ 5 రోజుల్లో రూ.18.43 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. ఇదేకాలంలో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 18,43,121 కోట్లు తగ్గి రూ. 4,40,99,217 కోట్లకు (5.18 ట్రిలియన్ డాలర్లు) చేరింది. శుక్రవారం ఒక్కరోజులోనే రూ.8.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. యూఎస్ ఫెడ్ ఇన్వెస్టర్లను నిరాశపర్చడంతో గ్లోబల్ మార్కెట్లు కూడా శుక్రవారం క్షీణబాటలోనే ఉన్నాయి. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు తగ్గా యి. యూరప్‌లోనూ ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు నెగిటివ్‌గా ముగిసాయి.
అధిక విలువలతోనే తంటా
యూఎస్ ఫెడ్ వచ్చే ఏడాదికి రేట్ల కోత అంచనాల్ని తగ్గించడం గ్లోబల్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని, భారత్ మార్కెట్‌పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇప్పటికీ ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో స్టాక్ విలువలు అధికంగా ఉండ టం, భవిష్యత్ వృద్ధి అంచనాలు తగ్గడంతో మార్కెట్ బేరిష్‌గా మారిందని వివరించారు. మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల విలువలు చరిత్రాత్మక గరిష్ఠస్థాయిలో ఉన్నందున, ఆ షేర్లలో అమ్మకాలు మరింత తీవ్రంగా ఉన్నాయన్నారు.
డాలర్ ఇండెక్స్ బలోపేతం అవుతు న్నందున విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల్ని డాలర్ ఆస్తుల్లోకి తరలిస్తున్నందున శుక్రవారం స్టాక్స్ భారీ పతనాన్ని చవిచూశాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. మరోవైపు జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత కల్లోలం సృష్టిస్తాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.
అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే
అమ్మకాల తీవ్రత కారణంగా అన్ని రం గాల సూచీలు నష్టపోయాయి. అధికంగా రియల్టీ ఇండెక్స్ 4.07 శాతం తగ్గింది. పవర్ ఇండెక్స్ 3.55 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండె క్స్ 2.67 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.02 శాతం, బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 2.61 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 2.32 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 2.29 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.11 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.43 శాతం చొప్పున క్షీణించాయి.
అమ్మకాల బాటలోనే ఎఫ్‌పీఐలు
మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు వరుసగా ఐదో రోజూ కొనసాగాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ.3,597 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో వరుస ఐదు రోజుల్లో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న పెట్టుబడులు రూ. 15,000 కోట్లను మించాయి.
ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు
శుక్రవారంనాటి ట్రేడింగ్ సెషన్లో ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధాన స్టాక్ సూచీల్ని ఐటీ, చాలావరకూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల షేర్లు కృంగదీసాయని స్టాక్స్‌బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ అమేయా రణదివే చెప్పారు. సెన్సెక్స్ ప్యాక్ లో టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, లార్సన్ అండ్ టుబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్ షేర్లు 2 శాతం మధ్య నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే, టైటాన్ షేర్లు స్వల్పలాభంతో ముగిసాయి.