calender_icon.png 25 November, 2024 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే నెలలో రూ.20,000 కోట్ల ఐపీవోలు రెడీ

25-11-2024 12:09:04 AM

న్యూఢిల్లీ, నవంబర్ 24: వచ్చే డిసెంబర్ నెలలో రూ. 20,000 కోట్ల సమీకరణకు కనీసం 10 కంపెనీలు పబ్లిక్ ఆఫర్లు జారీచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సూపర్‌మార్ట్ సంస్థ విశాల్ మెగామార్ట్, అంతర్జాతీయ ఫండ్ బ్లాక్‌స్టోన్‌కు చెందిన డైమండ్ గ్రైండింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్‌లాజికల్ ఇనిస్టిట్యూట్ ఇండియా లిమిటెడ్ తదితర కంపెనీల ఐపీవోలు డిసెంబర్‌లో ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయని మర్చెంట్ బ్యాంకర్లు తెలిపారు.

విద్యా రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీ అవన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టీపీజీ క్యాపిటల్ ఫండింగ్‌తో నడుస్తున్న సాయి లైఫ్ సైన్సెస్, హాస్పిటల్ చైన్‌ను నిర్వహిస్తున్న పారస్ హెల్త్‌కేర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్ తదితర సంస్థలు డిసెంబర్‌లో ఐపీవోలను జారీచేస్తాయని వారు వివరించారు. 

ఐపీవో యాక్టివిటీకి ఊతం

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు, యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలతో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొన్నదని, దీంతో ఐపీవో యాక్టివిటీ, నిధుల సమీకరణ ప్రయత్నాలు పుంజుకుంటాయని ఆన్‌లైన్ బ్రోకరేజ్ హవుస్ ట్రేడ్‌జిని చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ త్రివేశ్ చెప్పారు.

2024 సంవత్సరం ఐపీవోలకు ఊపుతెచ్చిందని, అయితే ఇటీవల సెకండరీ మార్కెట్ భారీ క్షణతతో కొన్ని పబ్లిక్ ఆఫర్లు సతమతమయ్యాయని ఆయన వివరించారు. ఎన్నికల ఫలితాల కోసం వేచిచూసిన ఫండ్స్ ఇక మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తాయని, దీనితో ఐపీవో విభాగం కొంతమేర పుంజుకుంటుందని త్రివేశ్ అంచనా వేశారు. 

విశాల్ మెగామార్ట్ నుంచి రూ.8 వేల కోట్ల ఐపీవో

రిటైల్ స్టోర్స్‌ను నడుపుతున్న విశాల్ మెగామార్ట్ ఐపీవో జారీచేసి రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తున్నది. ఈ ఐపీవో మొత్తం ప్రమోటర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలోనే ఉంటుంది. ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. జెమ్‌లాజికల్ ఇనిస్టిట్యూట్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ, 4,000 కోట్లు సమీకరించాలని చూస్తున్నది.

ఇందులో రూ. 1,250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుంది. మరో రూ.2,750 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ బ్లాక్‌స్టోన్ అనుబంధ సంస్థలు ఓఎఫ్‌ఎస్ రూట్‌లో విక్రయిస్తాయి. అవన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.3,500 కోట్ల సేకరణ లక్ష్యంతో ఐపీవోకు వస్తున్నది.