calender_icon.png 17 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం మార్కెట్ అభివృద్ధికి రూ.100 కోట్లు

17-01-2025 01:42:59 AM

* వచ్చే సీజన్ కల్లా మార్కెట్ స్వరూపం మారాలి 

* వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

*  పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదంపై నివేదికకు ఆదేశం

ఖమ్మం, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గురువారం మంత్రి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి, బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో  రాత్రి జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. అగ్ని ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో రూ.1000 కోట్లతో మెగా మార్కెట్‌ను అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.

విమానాశ్రయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ మధ్యలో 400 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పెద్దపెద్ద మార్కెట్‌లను అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

మద్దులపల్లిలో కొత్త మార్కెట్  

గతంలో సిద్ధారెడ్డి కాలేజీ ఆవరణలో ఉన్న పత్తి మార్కెట్, పక్కన కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశామని, దీన్ని  ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ మిర్చి ఘాటు అధికంగా ఉంటున్నందున  మద్దులపల్లిలో కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో నగర మేయర్ పీ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్‌కో నమస్కారం

ఖమ్మం, జనవరి 16 (విజయక్రాంతి): నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసేందేమీ లేదని, అందులో ఆయన కృషి లేదంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్‌గా స్పందించారు.

గురువారం ఆయన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన సందర్భంలో మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి తుమ్మల తీవ్రంగా స్పందించారు. ‘బండి సంజయ్‌కో నమస్కారం.. అది ఆయన విజ్ఞత, ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యులు.. అర్వింద్ గారికి మళ్లో నమస్కారం.. నేను వ్యవసాయమంత్రిని అయ్యాక ప్రధానమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని విజ్ఞప్తి చేశా.

పెద్ద మనస్సుతో ఆయన పసుపు బోర్డు తెలంగాణాకు ఇచ్చారు’ అని తుమ్మల అన్నారు. నా రాష్ట్రంలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల మా రాష్ట్ర రైతులకు మేలు జరిగింది కాబట్టి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశా. అందులో నా తప్పు ఉంటే మీరైనా(విలేకరులు) శిక్షించండి, లేదా అర్వింద్ శిక్షించినా తాను బాధ్యత వహిస్తానని అన్నారు. ఆ పెద్ద మనిషి గౌరవ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి తాను గౌరవంగా మాట్లాడుతా.. ఆయన గౌరవం.. మర్యాద ఆయన ఇష్టమని తు  వాపోయారు.