20-03-2025 02:37:56 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): పేదలకు సొంతింటి కల నెరవేర్చేం దుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇళ్లను ప్రతీ పేదవాడికి రూ.5లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ కేటాయింపుల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. ఈ మేరకు 2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 12,571 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వం మహిళల పేరుతోనే ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
అంతే కాకుండా గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో అసంపూర్తిగా నిలిచిపోయిన 34,545 ఇళ్ల నిర్మాణాలకు రూ.305.03 కోట్లు నిధులు కేటాయించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డును అనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసి అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది.
మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగా పేదవారికి అవకాశం ఇవ్వాలని, వారిలో వితంతువులు, దివ్యాంగులు, పారిశుధ్య కార్మికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులను కూడా ఇప్పటికే స్వీకరించింది.