calender_icon.png 23 September, 2024 | 5:47 PM

రూ.2.2 కోట్ల నగదు.. 35 తులాల గోల్డ్ అపహరణ

23-09-2024 01:16:26 AM

  1. భూమి విక్రయించగా యజమాని చేతికి భారీగా అడ్వాన్స్
  2. ఇంట్లో భద్రపరచగా.. పక్కా స్కెచ్‌తో మాయం
  3. బాధితుడి డ్రైవర్ అరెస్ట్.. మక్తాలో వెలుగు చూసిన ఘటన

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 22: వేలు కాదు.. లక్షలు కాదు.. దుండగులు ఏకంగా రూ.2.5 కోట్ల నగదును అపహరించారు. 35 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం మక్తా గ్రామంలో వెలుగు చూసిం ది. పోచారం ఐటీ కారిడార్ ఇన్‌స్పెక్టర్ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మక్తా గ్రామానికి చెందిన బైనగాని నాగభూషణం, పద్మమ్మ దంపతులు నారపల్లిలో  డెయిరీఫాం నడుపుతున్నారు. నాగభూషణం ప్రతిరోజూ తెల్లవారు జామున డెయిరీ ఫాంకు వెళ్లి సిబ్బందితో పాలు తీయించి, వాటిని వాహనాల్లో సరఫరా చేయిస్తాడు.

నాగభూషణం ఇటీవల శంకర్‌పల్లిలోని భూమిని అమ్మగా అడ్వాన్స్ కింద రూ.2.2 కోట్ల నగదు చేతికి వచ్చింది. ఆ సొమ్మును నాగభూషణం తన ఇంట్లోని బెడ్ రూం డ్రెస్సింగ్ కబోర్డ్‌లో భద్రపరిచాడు. రోజూలాగానే నాగభూషణం ఆదివారం ఉదయం 4 గంటలకు భార్య ఇంట్లో ఉండగా మెయిన్ డోర్‌కు గొళ్లెం పెట్టి డెయిరీ ఫాంకు వెళ్లాడు. అనంతరం గుర్తుతెలియని దుండగులు గొళ్లెం తీసి లోపలికి ప్రవేశించారు. రూ.2.2 కోట్ల నగదుతో పాటు 35 తులాల బంగారు ఆభరణాలు అపహరించి ఉడాయించారు.

తెల్లవారిన తర్వాత నిద్రలేచిన భార్య మెయిన్ డోర్ తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించింది. తర్వాత బెడ్‌రూమ్ లోకి వెళ్లి చూడగా డ్రెస్సింగ్ కబోర్డ్‌లోని నగదు, అభరణాలు కనిపించలేదు. దీంతో ఖింతో భర్తకు కాల్ చేసి చెప్పింది. నాగభూషణం ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, పోచారం ఐటీసీ ఇన్‌స్పెక్టర్ రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌తో ఆధారాలు సేకరించారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అనుమానితుడైన నాగభూషణం కారు డ్రైవర్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భూమి అమ్మగా నాగభూషణానికి అడ్వాన్స్‌గా భారీగా నగదు అందిన విషయం డ్రైవర్‌కు తప్ప ఎవరికీ తెలియదని, అతడు మరికొందరితో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయని, త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ చక్రపాణి తెలిపారు.