calender_icon.png 13 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్ పరిహారంపై ప్రభుత్వానికి విన్నవిస్తా

16-07-2024 12:05:00 AM

మెదక్, జూలై 15(విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోతున్నామని, దానివల్ల తీవ్రంగా నష్టపోతామని, అలైన్మెంట్ మార్చాలని, పరిహారం పెంచాలని రెడ్డిపల్లి రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలైన్మెంట్ మార్చడం వీలుకాదని, అయినప్పటికీ ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.

పరిహారం విషయంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. సమావేశంలో నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్, సత్యానారాయణగౌడ్, మహేశ్‌గౌడ్, సత్యనారాయణ, నిరంజన్, నగేశ్‌గౌడ్, ప్రసాద్ పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌డీవో శ్రీనివాసరావు, డీఈవో రాధాకృష్ణ, డీఏవో గోవింద్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, డీఎఫ్‌వో రవికుమార్, డీపీవో యాదయ్య, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

భూమికి బదులు భూమి ఇవ్వాలి..

యాదాద్రి భువనగిరి, జూలై 15 (విజయక్రాంతి): ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి సేకరిస్తున్న భూములకు పరిహారంగా భూమికి భూమి లేదా బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ సోమవారం తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామ రైతులు తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. భూమి కోల్పోతున్న రైతులకు న్యాయం చేయకపోతే భూములను అప్పగించేంది లేదని పేర్కొన్నారు.