calender_icon.png 29 December, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లు ప్రజాప్రభుత్వ విజయం

29-12-2024 03:10:46 AM

సీఎం రేవంత్‌రెడ్డి చొరవ, నా కృషికి దక్కిన ఫలితం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయమని అన్నారు.

సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితమే ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లని స్పష్టంచేశారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్లు, రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించినట్టు గుర్తుచేశారు. 2017లో దీన్ని ప్రతిపాదించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు వెనుకబడ్డాయని విమర్శించారు.

2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ కోసం నిరంతరం కృషి చేసినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి భూసేకరణపై అనేకసార్లు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి, సమస్యలు పరిష్కరించామని వెల్లడించారు. ఓఆర్‌ఆర్ గేమ్ ఛేంజర్ అయితే, ట్రిపుల్ ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నట్టు స్పష్టంచేశారు.

తెలంగాణ అభివృద్ధిలో ఆర్‌ఆర్‌ఆర్ కీలక భూమిక పోషించనుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరిస్తే కేంద్ర మంత్రి గడ్కరి పెద్ద మనుసు చేసుకొని యుటిలిటీ ఛార్జీలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి తెలిపారు.