సామ్ ఆల్‌రౌండ్ మెరుపులు
రాజస్థాన్‌పై పంజాబ్ విజయం
ఆరంభంలో వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రాజస్థాన్ రాయల్స్.. సీజన్ గడుస్తున్నా కొద్ది నీరస పడుతోంది. ఒక దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట నెగ్గిన రాయల్స్.. వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారైనప్పటికీ... ఈ ఫలితం నాకౌట్ దశలో జట్టు ఆటతీరుపై పడే అవకాశం ఉంది. ఒక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట బంతితో రాణించి రాయల్స్‌కు కళ్లెం వేసిన పంజాబ్.. ఆనక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిని పంజాబ్ సారథి సామ్ కరన్ బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో క్రీజులో పాతుకుపోయి అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు.
గువాహటి: సీజన్ ఆరంభంలో అదరగొట్టి ఆ తర్వాత వెనుకబడి పోయిన రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. బుధవారం జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఈ ఫలితంతో సంబంధం లేకుండానే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. నాకౌట్‌కు ఎప్పుడో దూరమైన పంజాబ్ పాయింట్ల పట్టిక అట్టడుగు స్థానం నుంచి ఒక అడుగు ముందుకేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లోకల్ బాయ్ రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవిచంద్రన్ అశ్విన్ (28; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. జోస్ బట్లర్ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో.. రాయల్స్ బ్యాటింగ్ కాస్త బలహీనపడగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) విఫలమయ్యాడు.
కెప్టెన్ సంజూ శాంసన్ (18) ఎక్కువ సేపు నిలువలేకపోగా.. బట్లర్ స్థానంలో జట్టులోకి వచ్చిన టామ్ కోలెర్ (18) అతడిని అనుసరించాడు. ధ్రువ్ జురెల్ (0), రావ్‌మన్ పావెల్ (4), డొనొవన్ ఫెరీరా (7) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, సామ్ కరన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేసింది. సామ్ కరన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కింగ్స్‌ను గెలిపించాడు. రొసో (22; 5 ఫోర్లు), జితేశ్ శర్మ (22; 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ (6), జానీ బెయిర్‌స్టో (14), శశాంక్ సింగ్ (0) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టడంతో పాటు.. బ్యాటింగ్‌లో అజేయ అర్ధశతకంతో రాణించిన సామ్ కరన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.
చేజేతులా..
సీజన్ ఆరంభంలో నిలకడ కనబర్చిన రాజస్థాన్ తొలి తొమ్మిది మ్యాచ్‌లు ముగిసే సరికి 8 విజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ దశలో రాయల్స్ టాప్ ప్లేస్‌లో నిలవడం ఖాయమని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీజన్ ముగింపు దశకు వచ్చేసరికి ఆ జట్టు టాప్ స్థానాల్లో నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కైతే చేరింది కానీ.. ఫైనల్ చేరేందుకు అదనపు అవకాశాన్ని కోల్పోయేలానే ఉంది. రాయల్స్ చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ కోల్‌కతాతో తలపడాల్సి ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో స్థానానికి చేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలిస్తే రాజస్థాన్‌ను తోసిరాజని రెండో స్థానానికి చేరడం ఖాయమే. చివరి మ్యాచ్‌లో రాయల్స్ ఓడి.. సన్‌రైజర్స్ రెండింట్లో ఒక్క మ్యాచ్ నెగ్గినా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆరెంజ్ ఆర్మీనే ముందడుగు వేయనుంది!
పాయింట్ల పట్టిక 2024
జట్టు మ్యా గె ఓ ఫ.తే ర.రే పా
కోల్‌కతా 13 9 3 1 1.42 19
రాజస్థాన్ 13 8 5 ౦ 0.27 16
చెన్నై 13 7 6 ౦ 0.52 14
హైదరాబాద్ 12 7 5 ౦ 0.40 14
ఢిల్లీ 14 7 7 ౦ 14
బెంగళూరు 1౩ 6 7 ౦ 0.38 12
లక్నో 1౩ 6 7 ౦ 12
గుజరాత్ 13 5 7 1 11
పంజాబ్ 13 5 8 ౦ 10
ముంబై 13 4 9 ౦ 8
నోట్: మ్యాఁ గెహాగెలిచినవి, ఓ ఫ. తే తేలనివి, ర. రే పావూ